రికార్డు స్థాయిలో 8.19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ …గతేడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు 100535 మంది రైతులకు రూ. 1786.13 కోట్ల బిల్లుల చెల్లింపులు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి
యాసంగి-2025 సీజన్ కు సంబంధించి వరి ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలువడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు తదితరులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం సేకరణ, ఖరీఫ్ సాగుకు సన్నద్ధత, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, భూ భారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణ అంశాలపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
యాసంగి సీజన్ ధాన్యం సేకరణ అంశంపై చర్చిస్తూ, నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 8.19 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ పూర్తి చేయడం పట్ల కలెక్టర్ ను, సంబంధిత అధికారులను అభినందించారు.
ఇదే స్పూర్తితో మిగిలిన ధాన్యాన్ని సైతం పూర్తి స్థాయిలో సేకరించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని, ఎవరైనా మిల్లర్లు, దళారులు రైతులను నష్టపరిచేవిధంగా వ్యవహరిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ముందస్తుగానే రుతుపవనాలు ప్రవేశించినందున, తదనుగుణంగా ఖరీఫ్ సీజన్ కు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై అవసరమైతే పీ.డీ యాక్టును అమలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు.
మండల స్థాయిలో తహసీల్దార్లు, మైనింగ్, కార్మిక శాఖ తదితర అధికారులతో కూడిన ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి, మేస్త్రీ చార్జీలు, క్రషర్ ధరలను పర్యవేక్షించేలా చూడాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఉచిత ఇసుక కూపన్లు అందించాలని సూచించారు.
ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి విరివిగా రుణాలు అందించాలన్నారు. అదేవిధంగా వచ్చే జూన్ 03 నుండి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని మార్గనిర్దేశం చేశారు.
జిల్లా ఇంచార్జ్ మంత్రులు ఈ నెల 28, 29 తేదీలలో క్షేత్రస్థాయిలో పర్యటించి పై అంశాల అమలును పరిశీలన జరపాలని, వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికను అందించాలని సీ.ఎం సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలో ధాన్యం సేకరణపై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.
జిల్లాలో గత ఏడాది రబీ సీజన్ లో ఇదే సమయానికి 4.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించగా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 8.19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిపి నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు.
గతేడాదితో పోలిస్తే ఈ రబీ సీజన్ లో ఇప్పటికే 3.85 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయని వివరించారు.
700 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టామని, కొనుగోళ్లు పూర్తయిన నేపథ్యంలో 625 కేంద్రాలను మూసివేశామని, 75 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశలో ఉందని తెలిపారు.
సేకరించిన వరి ధాన్యంలో సింహభాగం సన్న రకం ధాన్యం 7.26 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, దొడ్డు రకం ధాన్యం 93.24 వేల మెట్రిక్ టన్నులు మాత్రమేనని వివరించారు.
సేకరించిన ధాన్యానికి సంబంధించి 100535 మంది రైతులకు వారి ఖాతాలలో రూ. 1786.13 కోట్ల బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
