ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో పౌరుల బాధ్యత ఎంతో కీలకమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు.
శనివారం ఆర్మూర్‌లోని సాయి గార్డెన్స్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..శాంతియుత వాతావరణం ఉన్న చోటే అభివృద్ధి సాధ్యమవుతుంది.
నేరాలను ప్రాథమిక దశలోనే అరికట్టేందుకు, నేరాలు జరిగినప్పుడు నిందితులను త్వరితగతిన గుర్తించేందుకు ప్రతి వీధిలో, కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు అత్యవసరమ”ని సూచించారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ హెచ్చరించారు.
తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నమ్మి వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే సంబంధిత విలేజ్ పోలీస్ ఆఫీసర్‌ను (వీపీఓ) సంప్రదించాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ప్రజలకు భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గోనెల హరి, వైస్ చైర్మన్ కాట్పల్లి వెంకటరెడ్డి, అగ్రికల్చర్ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
