HomeLaw and Orderప్రజలలో అవగాహన పెంపొందించేందుకే గ్రామ, వార్డు సభలు

ప్రజలలో అవగాహన పెంపొందించేందుకే గ్రామ, వార్డు సభలు

తాగునీటి అవసరాల కోసం త్వరలో నిజాంసాగర్ ద్వారా నీటి విడుదల

ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి – పంటల మార్పిడి ఆవశ్యకతను గుర్తించాలి

హుమ్నాపూర్ గ్రామ సభలో కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి

సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వివిధ అంశాలపై ప్రజలలో అవగాహన పెంపొందించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ పంచాయతీలలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాలలో వార్డు సభలను నిర్వహిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు.

వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో శనివారం స్థానిక సర్పంచ్ అప్పిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జయజయహే తెలంగాణ గీతాలాపనతో సభకు శ్రీకారం చుట్టి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు.


పంటల మార్పిడి, సరైన మోతాదులో ఎరువుల వినియోగం, రక్షిత మంచినీటి సరఫరా, వర్షపు నీటిని ఓడిసిపట్టడం, భూగర్భ జలాల సంరక్షణ, విరివిగా మొక్కల పెంపకం, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ,

వానాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో నిజామాబాద్ జిల్లా అరుదైన ఘనతను కలిగి ఉన్నదని గుర్తు చేశారు. పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి విధానాన్ని అవలంభిస్తూ సాగు రంగంలో ప్రత్యేకతను చాటాలని రైతులకు సూచించారు.

ఎల్ నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున, తక్కువ సాగు నీటి అవసరం కలిగిన పంటలను విత్తుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం నోటిఫై చేసిన ఆయా పంట రకాలనే సాగు చేయాలని, నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నకిలీ, నాసిరకం విత్తనాలను విక్రయించే డీలర్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని, అర్హులైన రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ దోహదపడుతుందని తెలిపారు.
కాగా, వర్షాభావ పరిస్థితులు తలెత్తినా కూడా బోధన్, నిజామాబాద్ పట్టణాలు, నిర్దేశిత గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రానున్న రెండు రోజులలో నిజాంసాగర్ నీటిని విడుదల చేయించి, బెల్లాల్ చెరువులోకి మళ్లించడం జరుగుతుందన్నారు.

రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా ఈగలు, దోమల వ్యాప్తిని నివారించవచ్చని, తద్వారా వ్యాధులు సోకకుండా కాపాడుకోవచ్చని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక వ్యర్థాలను వేర్వేరుగా సేకరించాలన్నారు.
ప్రత్యేక ఓటరు సవరణ(ఎస్.ఐ.ఆర్) కార్యక్రమం గురించి ప్రజలకు సులభంగా అర్ధమయ్యే రీతిలో కలెక్టర్ బోర్డుపై ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలు రాస్తూ అవగాహన కల్పించారు.

జూన్ 25 నుండి బీ.ఎల్.ఓలు ఇంటింటికి తిరుగుతూ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ నిర్వహిస్తారని, వారికి సహకరించాలని ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకుంటూ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ హితవు పలికారు. అర్హులైన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందేలా చొరవ చూపాలన్నారు.

గ్రామ సభలో బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి మధుసూదన్, ఏసీపీ శ్రీనివాస్, డీ.ఎల్.పీ.ఓ శ్రీనివాస్, తహసిల్దార్ ప్రశాంత్, స్థానిక అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments