పదవి కాలం పూర్తీ అయిన కార్పొరేషన్ లకు ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్లతో చర్చించి కార్పొరేషన్ పదవులపై తుది నిర్ణయం తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
పార్టీ లో అంతర్గత వ్యవహారాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు.. కడియం శ్రీహరి, కొండ సురేఖ, తుంగతుర్తి లో రచ్చ వ్యవహారాలపై సచిన్ సావంత్, జగ్గారెడ్డి పరిశీలకులుగా నియమించామని వెల్లడించారు.
వారిద్దరూ క్షేత్రస్థాయి నుంచి విచారణ జరిపి పార్టీకి నివేదిక ఇస్తారని, ఆ తర్వాతే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.పదేళ్లు మంత్రిగా ఉండి హరీష్ రావు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ మూడు నెలలు మంత్రిగా అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు టైమ్ ఎందుకు ఇవ్వాలి? వారి హయాంలో నే కట్టిన ప్రాజెక్టులు కుంగిపోయాయి.
దానికి ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి బిఆర్ యస్ నేతలకు మిట్ట మధ్యాహ్నమే చుక్కలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో “హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని చెబితే, మా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు .
బీఆర్ఎస్ నిధులపై స్పందిస్తూ.. కవిత చేసిన ఆరోపణల్లో నిజం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీకి రూ.1,400 కోట్లు ఎలా జమ అయ్యాయో చెప్పాలని, దీనిపై ఖచ్చితంగా అనుమానాలు వస్తున్నాయని అన్నారు.
