తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలుతెలంగాణ నాన్-గెజిటెడ్ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్. ఎం. హుస్సేనీ (ముజీబ్) తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర పుణ్యక్షేత్రమైన మక్కాలో ఉమ్రా తీర్థయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు.
ఈ సందర్భంగా కాబా గృహం వద్ద ఆయన అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ హుస్సేనీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతియుతమైన జీవనాన్ని గడపాలని అల్లాహ్‌ను ప్రార్థించినట్లు తెలిపారు.
సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందడం ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కీర్తిప్రతిష్టలు ఆర్జించాలని, తెలుగు రాష్ట్రాల్లో సోదరభావం, ఐకమత్యం వెల్లివిరియాలని కోరుకున్నట్లు వివరించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమం కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని డాక్టర్ హుస్సేనీ స్పష్టం చేశారు. తన సేవా కార్యక్రమాలను యూనియన్ వేదికగా మరింత ఉత్సాహంతో కొనసాగిస్తానని, ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతానని హామీ ఇచ్చారు.
ఉమ్రా యాత్ర తన జీవితంలో ఒక మరపురాని మధుర జ్ఞాపకమని, ఇక్కడి ప్రశాంత వాతావరణం తనకు సరికొత్త ఉత్సాహాన్ని, సేవా దృక్పథాన్ని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో తనవంతు పాత్రను మరింత సమర్థవంతంగా పోషిస్తానని ఆయన తెలిపారు.
