వెనిజులా పై అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ దాడిని నిరసిస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో అమెరికా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదులు వెనిజులా దేశంపై బాంబులు కురిపించి, ఆ దేశ అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను కిడ్నాప్ చేసి న్యూయార్క్ కు తీసుకపోవడం దుర్మార్గమైన చర్యన్నారు. వెనిజులాపై అమెరికా దురక్రమణను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే మధురో, ఆయన భార్యను విడుదల చేయాలన్నారు.
కొద్ది రోజుల నుంచి కరేబియన్ సముద్రంలో తన 8 యుద్ద నౌకలను మొహరించి, యుద్ద విమానాలను చుట్టూ పెట్టి వెనుజులాను దిగ్బంధనం చేశారన్నారు. డ్రగ్స్, మత్తు మందులు అమ్ముతున్నారని, అలానే వెనుజులా మిలటరీ, మదురో ఆయుధాలతో అమెరికాకు కొందరిని పంపించి హింసను సృష్టిస్తున్నారని ఆధారం లేని అబద్ధపు ప్రచారాలు అమెరికా చేసిందన్నారు. ఇది దాడికి ముందు ఉద్దేశ్య పూర్వకంగా చేసిన అసత్య ప్రచారమన్నారు.
వెనిజులాలోని అపార పెట్రోసంపదను, వజ్రాలు, బంగారం, ఇతర ఖనిజాలను దోచుకునే దురాక్రమణ కుట్రలో భాగమే ఈ దురాక్రమణ అని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమనను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయని కానీ భారత్ నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికి ఖండించకపోవడం అన్యాయమన్నారు.
ఒకవైపు మన దేశంపై అమెరికా అనేక రకాలుగా ఆంక్షలు పెంచుతున్నా, అక్రమ వలసల పేరుతో భారతీయుల్ని వెనక్కి పంపుతున్నా, మరోవైపు మూడో ప్రపంచ దేశాలపై అమెరికా దురాక్రమణ చేస్తున్నా మోడీ ప్రభుత్వం అమెరికా వైఖరిని ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు.
అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణను కేంద్ర ప్రభుత్వం ఖండించాలన్నారు. వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ దాడిని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని నిరసించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, జిల్లా నాయకులు డి.రాజేశ్వర్, కే.గంగాధర్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ నాయకులు లింగం, భాస్కర్, సాయిబాబా, కిరణ్, సాయరెడ్డి, అమూల్య, చరణ్, అశుర్, విజయ్ కుమార్, సృజన్, గంగాధర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
