- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు..
- చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు..
జాన రమేష్:ఇది సంగతి;ఆర్మూర్:
మృగాళ్లు రెచ్చిపోతున్నారు. నిత్యం ఏదో ఒకచోట మైనర్లపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. పసి పిల్లల్ని సైతం వదలటం లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు పసికందులను చిదిమేస్తున్నారు.
మానవత్వం మంట కలిపి తమలో ఉన్న లైంగికత్వాన్ని ప్రదర్శిస్తూ మైనర్ బాలికల పట్ల లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. చట్టాలు ఎంత కఠినంగా వ్యవహరించిన ఇలాంటి దుర్ఘటనలు జిల్లాలో ఏదో మూలన నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. ఆర్మూర్ పట్టణంలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
తాజాగా ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కు చెందిన 12 ఏళ్ల మైనర్ బాలికపై శనివారం అత్యాచారం జరిగినట్లు తెలిసింది. రాజారాం నగర్ లో తల్లితోపాటు బాలిక అద్దె ఇంట్లో ఉంటుంది. తల్లి జీవనోపాధి కోసం కూలి పని చేయడానికి కూతుర్ని ఇంట్లో ఉంచి ప్రతిరోజు వెళ్లినట్లు గానే వెళ్ళింది. బాలికను ఇంట్లో పెట్టి కూలి పని చేయడానికి తల్లి వెళ్ళగానే ఓ కామాంధుడు గదిలోకి ప్రవేశించాడు.
చిన్నారి బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసినట్లు తెలిసింది. అత్యాచారం చేయడంతో బాలికకు రక్తస్రావం అయింది. దీంతో బాలిక కూలికి వెళ్లిన తల్లికి సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న తల్లి వెంటనే ఇంట్లోకి వచ్చి తన కూతుర్ని చూసి బోరున విలపించి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు తీసుకున్న సీఐ రవికుమార్ తన సిబ్బందితో కలిసి రాజారాం నగర్ లో అత్యాచారం జరిగిన ఇంట్లోకి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే బాలికను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షతోపాటు చికిత్స నిమిత్తం తరలించారు. గత కొద్ది రోజుల కిందట ఆర్మూర్ మండలం చేపూరు గ్రామంలో జరిగిన మైనర్ బాలికపై దాడి ఉదంతం మరువకముందే ఇలా జిల్లాలో రోజూ ఏదో ఒక చోట ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేసి నేరస్తులపై కేసులు నమోదు చేసేలా చేస్తున్నారు. మరికొందరు పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందని గుట్టచప్పుడు కాకుండా ఉంటున్నారు. మహిళల హక్కులు, వారి రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా.. అమలుకు మాత్రం నోచుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రోజు రోజుకు పెరిగి పోతున్న కామాందుల ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే ముందుగా విద్యార్థి స్థాయి నుంచే చట్టాలపై అవగాహన కల్పించాలి.
ఆత్మరక్షణకోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేక శిక్షణ అవసరం. తాగిన మైకంలో మానసిక వికలాంగులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారు కొందరుండగా.. కామంతో కళ్లు మూసుకుపోయి మనుమరాలు వయస్సున్న వారిపై అత్యాచారాలకు ఒడిగట్టిన ప్రబుద్ధులు కూడా ఉండటం శోచనీయం.