బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, చట్టప్రకారం వాటిని వేగంగా పరిష్కరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి సీపీ స్వయంగా హాజరై బాధితుల నుంచి 40 అర్జీలను స్వీకరించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కమిషనర్‌కు విన్నవించుకోగా, మొత్తం 40 ఫిర్యాదులు నమోదయ్యాయి.ఈ సందర్భంగా పలువురు బాధితుల సమస్యలపై సీపీ అక్కడికక్కడే స్పందించారు.
సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలతో ఫోన్లలో మాట్లాడి, ఆయా కేసుల స్థితిగతులపై ఆరా తీశారు. బాధితులకు న్యాయం జరిగేలా తగిన సూచనలు చేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు పోలీసులు మరింత చేరువవడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తోందని స్పష్టం చేశారు.
బాధితులు ఎలాంటి భయాలు, మూడో వ్యక్తి ప్రమేయం లేదా పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకే ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు.
