నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని పెండింగ్ కేసుల పురోగతిపై ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కుంభకోణాలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును ముమ్మరం చేయాలని సీపీ స్పష్టం చేశారు. సాక్ష్యాధారాల సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, కోర్టుల్లో ప్రాసిక్యూషన్‌ను బలోపేతం చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నగరంలో పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలు, ముఖ్యంగా సైబర్ ఫ్రాడ్స్, బ్యాంకింగ్ మోసాలు, నకిలీ పత్రాల సృష్టిపై సీపీ ఆందోళన వ్యక్తం చేశారు.నేరాల నివారణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. ప్రజలు మోసపోకుండా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని సీపీ సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ‘బ్లాక్ స్పాట్స్’ గుర్తించి, అక్కడ హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. రహదారి ఇంజనీరింగ్ లోపాలను గుర్తించి నేషనల్ హైవే, స్టేట్ హైవే అధికారులతో సమన్వయం చేసుకుని వాటిని సరిదిద్దాలి.
మద్యం సేవించి వాహనాలు నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్), ఓవర్ స్పీడ్, మైనర్ డ్రైవింగ్‌లపై కఠినంగా వ్యవహరించాలి.ప్రతిరోజూ స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి, ఏసీపీలు బి. ప్రకాష్ (నిజామాబాద్), శ్రీనివాస్ (బోధన్), వెంకటేశ్వర రెడ్డి (ఆర్మూర్), రాజశేఖర్ (సీటీసీ), స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్బీ సీఐలు రమేష్, అంజయ్య, మహిళా పీఎస్ ఎస్హెచ్ఓ శ్రీలత ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
