HomeHEALTHడ్రైవర్లకు చూపు మెరుగైతేనే ప్రమాదాలకు చెక్! 'అరైవ్ అలైవ్' శిబిరంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.....

డ్రైవర్లకు చూపు మెరుగైతేనే ప్రమాదాలకు చెక్! ‘అరైవ్ అలైవ్’ శిబిరంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.. డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు.. సీపీఆర్ పై అవగాహన..

రహదారిపై వాహనం నడిపే డ్రైవర్ల దృష్టి (చూపు), వినికిడి సామర్థ్యం సక్రమంగా ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుందని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. శుక్రవారం నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన “అరైవ్ అలైవ్ – 2026” రెండో దశ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి, వినికిడి పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. చాలా సందర్భాల్లో చూపు మందగించడం, కంటి ఒత్తిడి, వినికిడి లోపం వంటి కారణాల వల్ల డ్రైవర్లు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లయన్స్ ఐ హాస్పిటల్, ఐఎంఏ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో భారీ వాహన, ఆటో, అంబులెన్స్ డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించారు.

దృష్టి లోపం ఉన్న వారికి ఉచితంగా కళ్లజోళ్లు, మందులను పంపిణీ చేశారు. కేవలం వైద్య పరీక్షలే కాకుండా, రహదారిపై ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసరంగా ప్రాణాలు కాపాడే సీపీఆర్ విధానంపై డ్రైవర్లకు ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చారు. “ప్రయాణికుల ప్రాణ భద్రత డ్రైవర్ల బాధ్యత. అతివేగం, లేన్ క్రమశిక్షణ పాటించకపోవడం, అలసటతో వాహనం నడపడం ప్రాణాంతకం” అని డ్రైవర్లను హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు బస్వారెడ్డి, రామ్ చంద్ర రావు, ఏసీపీలు ప్రకాష్, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, రాజశేఖర్, మస్తాన్ అలీ పాల్గొన్నారు. అలాగే ఐఎంఏ అధ్యక్షుడు డా. విశాల్, సెక్రటరీ హరీష్ స్వామి, లయన్స్ హాస్పిటల్ వైద్యులు డా. దీప్తి, అలేఖ్య, వైశాలి, వినోద్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఐరాడ్ మేనేజర్ వర్షా నిహాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments