HomeTelanganaNizamabadఅభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క...

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క…

ఇందల్వాయి మండలం వెంగల్ పాడ్, తిర్మన్ పల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శనివారం జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క శంకుస్థాపనలు చేశారు.

రాంపూర్ తండా నుండి వెంగల్ పాడ్ తండా వరకు రూ.5.48 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న బీ.టీ రోడ్డు నిర్మాణానికి, అలాగే కే.కే తండా నుండి మెగ్యానాయక్ తండా వరకు రూ. 2.94 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం తిర్మన్ పల్లిలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో అదనపు సదుపాయాల కల్పనలో భాగంగా నూతనంగా నిర్మించిన వసతి గృహ భవన సముదాయం, కిచెన్ డైనింగ్ హాల్ లను లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి మంత్రితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మారుమూల గిరిజన తండాలు, గ్రామాలలో అభివృద్ధి పనులలో పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. పిల్లలు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయిలో రాణించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమని అన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా రూరల్ నియోజకవర్గంలో గిరిజన తండాలు, ట్రైబల్ వెల్ఫేర్ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. కాగా, ఏకధాటిగా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా స్థానిక ప్రజలు, గిరిజనులు మంత్రికి ఘన స్వాగతం పలికి, ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కళాశాల విద్యార్థినులతో కలిసి సంప్రదాయ గిరిజన నృత్యంలో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మహిళా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ భుజంగ రావు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, తిర్మన్ పల్లి సర్పంచ్ చింతల కిషన్ తదితరులు పాల్గొన్నారు.-

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments