కప్పల వాగు పరివాహక ప్రాంతాల్లో అనుమతుల ముసుగులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రాత్రి , పగలు అనే తేడా లేకుండా ఇసుకను తరలించుకుపోతున్నారు.
మార్కెట్లో ఒక్కో ట్రాక్టర్ సుమారు రూ. నాలుగువేలకు పైగానే ధర పలుకుతుండటంతో అధికార పార్టీకి చెందిన కొంత మంది చోటామోటా నాయకులంతా అక్రమ ఇసుక మాఫియా పైనే దృష్టి సారించారు.
దీంతో ఈ అక్రమ ఇసుక వ్యాపారం మూడు ట్రాక్టర్లు , ఏడు ట్రిప్పర్లుగా సాగుతుందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇన్సూరెన్స్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లతో రాత్రి పగలు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా జరుపుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం, గృహ అవసరాల కోసం ఒక ట్రాక్టర్కు అనుమతి పొంది, దాని ముసుగులో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు వాగు నుండి అక్రమంగా ఇసుకను తొడిస్తూ కాసులు చేసుకుంటున్నారు.
భీంగల్, బడా భీంగల్ వాగుల నుండి గృహ అవసరాల పేరిట వే బిల్లులు తీసుకుని ఇసుకను డంపులుగా పోసి రాత్రి సమయంలో అక్రమంగా లారీలలో ఇసుకను తరలిస్తున్నారు. ఎమ్మార్వో షబ్బీర్ ఇసుక డంపులు ఉంటే సీజ్ చేస్తామని చెప్పిన అక్రమార్కులు అవేమీ పట్టించుకోవడం లేదు.
గృహ అవసరాల పేరుతో వే బిల్లులతో రోజు ఇసుక ట్రిప్పులు నడిస్తే అందులో ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి-? ఎక్కడికి వెళుతున్నాయని-? ప్రాథమిక విచారణ లేకుండానే వే బిల్లులను ఇవ్వడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఇసుక మాఫియాతో అధికారులు కుమ్మక్కయ్యారనే వాదన వెనక , నిజానిజాలను గుర్తించి రాత్రి సమయంలో ఇసుకను తరలించే ముఠా సభ్యుల పైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవలే ఇసుక నడుస్తున్న సమయంలో అధిక లోడ్, ఓవర్ స్పీడ్ తో వెళ్తూ మైనర్ లు నడపడంతో ప్రమాదాకు కారణం అయ్యే వాహనాలను రోడ్డు రవాణా అధికారులు కొన్ని వాహనాలను సీజ్ చేశారు .
అయితే రాజకీయ ఒత్తళ్ల తో కొన్ని వాహనాలు సీజ్ చేసి .. మరికొన్ని వాహనాలను వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పగటిపూట ట్రాక్టర్లలో ఇసుక డంపు చేసి.. రాత్రి వేళలో టిప్పర్లపై ఇసుకను జంపు చేస్తున్న అక్రమార్కులపై పోలీసు శాఖ కూడా గట్టిగా నిఘా వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!
