HomePOLITICAL NEWSUncategorizedఆస్తి కోసం తల్లీబిడ్డల హత్య..రెండేళ్ల బాలుడితో సహా తల్లిని హతమార్చిన దంపతులు..భార్యాభర్తలకు జీవిత ఖైదు..నిజామాబాద్‌ సెషన్స్‌...

ఆస్తి కోసం తల్లీబిడ్డల హత్య..రెండేళ్ల బాలుడితో సహా తల్లిని హతమార్చిన దంపతులు..భార్యాభర్తలకు జీవిత ఖైదు..నిజామాబాద్‌ సెషన్స్‌ కోర్టు తీర్పు

ఆస్తి కోసం సొంత తమ్ముడి భార్యను, రెండేళ్ల కుమారుడిని కిరాతకంగా హతమార్చిన కేసులో భార్యాభర్తలకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. నవీపేటకు చెందిన దాసరి రాజశేఖర్‌, అతడి భార్య నాగలక్ష్మీకి ఒక్కొక్కరికి జీవిత ఖైదుతోపాటు రూ.20 వేల చొప్పున జరిమానా విధిస్తూ నిజామాబాద్‌ సెషన్స్‌ జడ్జి జి.వి.ఎన్‌. భారతలక్ష్మి శుక్రవారం తీర్పు వెలువరించారు.

సాక్ష్యాలను మాయం చేసిన నేరానికి మరో ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొన్న మరో ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేశారు.

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ధర్పల్లి రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. నవీపేట మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌కు చెందిన దాసరి రాజశేఖర్‌, రాజబాబు అన్నదమ్ములు. వీరికి ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. రాజబాబుకు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అతడికి చెందాల్సిన ఆస్తిని కాజేయాలని రాజశేఖర్‌ పథకం వేసినట్లు విచారణలో తేలింది.

ఇందులో భాగంగా 2022 ఆగస్టు 2న అర్ధరాత్రి దాటిన తర్వాత భార్య నాగలక్ష్మితో కలిసి తమ్ముడి గుడిసెలోకి వెళ్లాడు. లత, ఆమె రెండేళ్ల కుమారుడు హర్షవర్ధన్‌ గొంతుకు నైలాన్‌ తాడు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాలను టాటా ఇండికా కారులో తీసుకెళ్లి మోర్తాడ్‌ మండలం గాండ్లపేట్‌ గ్రామ శివారులో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న తుమ్మ చెట్లలో పడేశారు.

లత తండ్రి గండయ్య ఫిర్యాదుతో మోర్తాడ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం భీంగల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ. వెంకటేశ్వర్లు కేసు విచారణ చేపట్టారు. నవీపేట, జానకంపేట్‌, అంకాపూర్‌, ఆర్మూర్‌, మోర్తాడ్‌ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి, అనుమానిత కారు కదలికలను గుర్తించారు.

అది రాజశేఖర్‌ ఉపయోగించిన కారుగా నిర్ధారించి, పరారీలో ఉన్న భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో భాగంగా నవీపేటతోపాటు నిజామాబాద్‌ నగరంలోని చంద్రశేఖర్‌ కాలనీ, గంగాస్థాన్‌ ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు సంబంధించిన పత్రాలను సేకరించారు. తమ్ముడికి తెలియకుండా నగరంలోని ప్లాటును విక్రయించి వచ్చిన రూ.66 లక్షల వ్యవహారాన్ని పరిశీలించారు.

హత్యల అనంతరం రాజశేఖర్‌ ఫోన్‌లో తొలగించిన వాట్సాప్‌ సందేశాలను సైతం సంబంధిత సంస్థల నుంచి సేకరించి, సాక్ష్యాధారాలతో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో రాజశేఖర్‌ను ఏ1గా, నాగలక్ష్మిని ఏ2గా, వనం సాయిబాబాను ఏ3గా, కోయ గంగాధర్‌, కోయ నాగమణిలను ఏ4, ఏ5గా పేర్కొన్నారు. విచారణలో లత, హర్షవర్ధన్‌ల హత్యకు, సాక్ష్యాలను మాయం చేయడానికి రాజశేఖర్‌, నాగలక్ష్మీ బాధ్యులని న్యాయస్థానం నిర్ధారించింది.

మిగతా ముగ్గురిపై హత్యలో ప్రమేయం నిరూపితం కాకపోవడంతో నిర్దోషులుగా విడుదల చేసింది.కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులు మోర్తాడ్‌ ఎస్‌ఐపీ ముత్యం రాజు, భీంగల్‌ సీఐ ఎ. వెంకటేశ్వర్లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి. రాజేశ్వర్‌రెడ్డి, బ్రీఫింగ్‌ ఆఫీసర్‌ ముత్యం రాజు, కోర్టు లైజన్‌ ఆఫీసర్‌ టి. గోవింద్‌, కోర్టు సీఎంఎస్‌, సీడీవో సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్య అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments