సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక వ్యవహారాలపై జరుగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తు కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది.
సాహితి ఇన్‌ఫ్రాకు సంబంధించిన రూ.2.10 కోట్ల నగదు లావాదేవీలు ఎమ్మెల్యే బ్యాంకు ఖాతాల ద్వారా జరిగినట్లు దర్యాప్తులో గుర్తించిన నేపథ్యంలో ఈ సమన్లు ఇచ్చినట్లు సమాచారం. సాహితి ఇన్‌ఫ్రా సంస్థపై ఫ్లాట్లు, విల్లాల విక్రయాల పేరుతో కొనుగోలుదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, హామీ ఇచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి.
ప్రీ-లాంచ్ ఆఫర్లతో నిధులు సమీకరించిన వ్యవహారంలో తొలుత రూ.248 కోట్ల మేర మోసం జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. కేసు దర్యాప్తు విస్తరించడంతో మొత్తం మోసం విలువ సుమారు రూ.842 కోట్లుగా ఉన్నట్లు ఈడీ అంచనా వేసింది.
ఎమ్మెల్యేకు సంబంధించిన ఖాతాల ద్వారా సాహితి ఇన్‌ఫ్రా నుంచి జరిగినట్లు చెబుతున్న రూ.2.10 కోట్ల లావాదేవీలపై ఈడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఆ నగదు ఎందుకు బదిలీ అయింది? ఎవరికి చేరింది? లావాదేవీల వెనుక ఉద్దేశం ఏమిటి? అనే అంశాలను విచారించనున్నట్లు తెలుస్తోంది. సాహితి ఇన్‌ఫ్రా ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థల ఖాతాలపైనా అధికారులు దృష్టి సారించారు.
కొనుగోలుదారుల నుంచి సేకరించిన మొత్తాలను సంస్థకు సంబంధించిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు దర్యాప్తులో ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.126 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు ఈడీ పేర్కొంది. బినామీ పేర్లతో ఆస్తుల కొనుగోలు జరిగిన అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
సంస్థ ఎండీ బి.లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావు తదితరులపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 56 బ్యాంకు ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది. గతంలో రూ.161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయగా.. మరో దశలో రూ.12.6 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.
మొత్తంగా సుమారు రూ.173.6 కోట్ల విలువైన ఆస్తులపై చర్యలు చేపట్టింది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగానే ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. సాహితి ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల ప్రచారంలో నటుడు జగపతిబాబు కనిపించిన విషయం కూడా గతంలో చర్చకు వచ్చింది.
