గంజాయి విక్రయాల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడన్న అనుమానంతో ఓ యువకుడిని అతడి స్నేహితులే కత్తితో పొడిచి హతమార్చిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.
రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహమ్మద్ వసీం (32)పై షోయబ్, ఇలియాజ్ కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం.వసీం, నిందితులు స్నేహితులుగా ఉన్నట్లు తెలిసింది. కొంతకాలంగా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న షోయబ్, ఇలియాజ్‌ల వ్యవహారం పోలీసులకు వసీం చేరవేశాడని వారు అనుమానించినట్లు సమాచారం.
దీంతో అతడిపై కక్ష పెంచుకున్న ఇద్దరూ అదను చూసి వసీంపై దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.నడిరోడ్డుపైనే కత్తులతో దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఘటనపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల కదలికలపై ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
