ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ వద్ద నిమజ్జనానికి తరలివచ్చిన యువకుల బృందంలో 20 ఏళ్ల యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు.
డ్యాన్స్ చేస్తున్న యువకులను పోలీసులు లాఠీలతో చెదరగొట్టడంతో భయపడిన యువకుడు ట్యాంకర్‌పైకి ఎక్కే ప్రయత్నంలో అదుపుతప్పి ట్రక్ కింద పడినట్లు అతడి స్నేహితులు ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం.
ఘటనతో అతడి స్నేహితులు ఖైరతాబాద్ వద్ద నిరసనకు దిగారు. పోలీసుల చర్యల కారణంగానే ప్రమాదం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.నిరసనకు దిగిన యువకులను పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని లాగిపడేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
