మరో రెండ్రోజులే గడువు.. బల్దియాకు పన్నుల సెగ!వంద కోట్లకు పైగా బకాయి.. వసూలైంది రూ.40 కోట్లే.ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండ్రోజుల సమయం మాత్రమే ఉండటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. నిర్దేశించిన లక్ష్యం కొండలా కనిపిస్తుంటే, క్షేత్రస్థాయిలో వసూళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. నగరంలో పేరుకుపోయిన పాత బకాయిలు ఏకంగా రూ. 100 కోట్లు దాటడం ఇప్పుడు బల్దియా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. నగరపాలక సంస్థకు రావాల్సిన ఆదాయంలో సింహభాగం ప్రభుత్వ సంస్థల నుంచే రావలసి ఉంది. కేవలం ప్రభుత్వ కార్యాలయాల నుంచే సుమారు రూ. 40 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి.ప్రభుత్వ ఆసుపత్రి అత్యధికంగా రూ. 25 కోట్ల బాకీ. ఇతర శాఖలు ఆయన జిల్లా పరిషత్, మార్కెట్ యార్డు, ఎక్సైజ్, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రైల్వే వంటి అన్ని కీలక విభాగాలు కూడా సుమారు 40 కోట్ల రూపాయల పన్నును బకాయి పడ్డాయి.పన్నులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న మొండి బకాయిదారులపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇప్పటికే సుమారు 1000 మందికి రెడ్ నోటీసులు జారీ చేశారు. స్పందించని పలు వాణిజ్య సముదాయాలు, షాపులను ఇప్పటికే సీజ్ చేసినట్లు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు స్పష్టం చేశారు. మొత్తం బకాయిల్లో రూ. 30 కోట్ల వరకు ‘మొండి’ బాకీలుగా గుర్తించిన అధికారులు, వాటిని రాబట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రస్తుతానికి వసూలైంది కేవలం రూ. 40 కోట్లు మాత్రమే. ఇంకా రూ. 60 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. చేతిలో ఉన్నది కేవలం రెండు రోజులే. ఈ స్వల్ప వ్యవధిలో ఇంత భారీ మొత్తాన్ని వసూలు చేయడం అధికారులకు అగ్నిపరీక్షగా మారింది. మరి ఈ కొద్ది రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేస్తారా లేక ఎప్పటిలాగే బకాయిల జాబితాను వచ్చే ఏడాదికి బదిలీ చేస్తారా అన్నది వేచి చూడాలి.
