క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలోనే అసోసియేషన్ ఎన్నికలు రసాభాసగా మారాయి. అధ్యక్ష పదవి కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న అభ్యర్థులు ఒకరిద్దరు అడ్డగోలు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులను టార్గెట్ గా చేసుకొని మాట్లాడుతున్నారు.
ఎన్నికల నిర్వహణలో వైఫల్యాలను ఆసరాగా గా చేసుకొని ఓ నిఘా అధికారి తెరవెనుక మంత్రాంగం నడుపు తుండడం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఏళ్ల తరబడిగా తమ చెప్పు చేతుల్లో ఉన్న సంఘం ఈసారి అనూహ్యంగా చేజారి పోతుండడంతో అన్నదమ్ములు వ్యూహాత్మకంగా తెరవెనుక పావులు కదుపుతున్నారు.
ఈ నేపథ్యలోనే రాష్ట్రం ఎక్కడా లేని విధంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. అధ్యక్ష స్థానం ఆశించిన అభ్యర్థులు ఎన్నికల నిర్వహణ లో అధికారులతో అనుచితంగా వ్యవహరించిన తీరు ఫై కమిషనర్ సీరియస్ గా ఉన్నారు.ఓ అభ్యర్థి ఏకంగా ఉన్నతాధికార్ల ను టార్గెట్ చెయ్యడం కలకలం రేపింది.
అందుకే సీపీ సైతం సమగ్ర విచారణకు ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదారు మంది అధికారుల వ్యవహారశైలిపై అంతర్గతంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.
ఎన్నికల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వారిలోనిఘా అధికారి కూడా ఉన్నట్లు సమాచారం.. ఎన్నికల వ్యవహారంలో క్రమశిక్షణ ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటికే ఒకరిపై చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.. పోలీసు సంఘం ఎన్నికల కోసం తొలుత జారీ చేసిన నోటిఫికేషన్‌లో పలు లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
నిబంధనలు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాల్లో స్పష్టత లేకపోవడంతో వివాదానికి బీజం పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ లోపాలను సరిదిద్ది కొత్త నోటిఫికేషన్ జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నోటిఫికేషన్ రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపైనా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
పోలీసు సంఘం ఎన్నికలు సిబ్బంది సంక్షేమం, ఐక్యతకు వేదికగా ఉండాల్సింది పోయి.. వ్యక్తిగత ఆధిపత్యాలు, వర్గ విభేదాలకు కేంద్రంగా మారాయన్న ఆరోపణలు శాఖలో చర్చనీయాంశంగా మారాయి. కొందరు అధికారులు రాజకీయ పార్టీల తరహాలో వ్యవహరించారన్న ఫిర్యాదులు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది.
క్రమశిక్షణకు విఘాతం కలిగించే ఎలాంటి వ్యవహారాన్నీ ఉపేక్షించేది లేదని సీపీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఎన్నికల రద్దుకు దారితీసిన పరిణామాల వెనుక ఎవరెవరి పాత్ర ఉందన్న అంశంపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకున్నవారిపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
మొత్తం వ్యవహారంపై సీపీ స్వయంగా వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.సెప్టెంబరు 1న మళ్లీ ‘పరీక్ష’తొలి ఎన్నికల అనుభవం నేపథ్యంలో ఈసారి ఎలాంటి వివాదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నిబంధనలను స్పష్టంగా పొందుపరిచి సవరించిన నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం. సెప్టెంబరు 1న ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది.
