HomeCRIMEదొంగల ముఠాలో అంతరాష్ట్ర నేరస్థుడు! 10 తులాల 8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం

దొంగల ముఠాలో అంతరాష్ట్ర నేరస్థుడు! 10 తులాల 8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం

నందిపేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన దొంగతనం కేసులో అంతరాష్ట్ర నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాల నిఘా, పక్కా సమాచారంతో నిందితుడిని నవీపేట్‌ రైల్వేస్టేషన్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద నుంచి దొంగిలించిన 10 తులాల 8 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.ఆర్మూర్‌ రూరల్‌ సీఐ జాన్‌రెడ్డి వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పర్భణి జిల్లా దర్గా రోడ్‌, కుర్బాన్‌ ఆలీషా నగర్‌కు చెందిన షేక్‌ ఖయ్యుమ్‌ రఫిక్‌ బేగ్‌ అలియాస్‌ షేక్‌ ఖయ్యుమ్‌ షేక్‌ రఫిక్‌ (23) లేబర్‌గా పనిచేస్తున్నాడు.

గతంలో మహారాష్ట్రలోని కొత్వాలీ పోలీస్‌స్టేషన్‌, కర్ణాటకలోని బీదర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధుల్లో నమోదైన దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 2023లో మహారాష్ట్రలోని కొత్వాలీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నాలుగు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

వివిధ కేసుల్లో అతను మూడేళ్లపాటు జైలు శిక్ష కూడా అనుభవించినట్లు తెలిపారు. అంతేకాకుండా పర్భణి జిల్లా కొత్వాలీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పిస్టల్‌ విక్రయించిన కేసులో ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

నందిపేట్‌ పరిధిలో చోరీ చేసిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు నిందితుడు శనివారం నిజామాబాద్‌ వైపు వెళ్తుండగా నవీపేట్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఆర్మూర్‌ రూరల్‌ సీఐ జాన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు.

పంచుల సమక్షంలో విచారించగా నందిపేట్‌ పరిధిలో చేసిన దొంగతనం నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 10 తులాల 8 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన ఆర్మూర్‌ రూరల్‌ సీఐ జాన్‌రెడ్డి, నందిపేట్‌ ఎస్‌ఐ వినయ్‌, హెచ్‌సీ నరేందర్‌, కానిస్టేబుళ్లు అనీల్‌, శ్రీనివాస్‌, షబ్బీర్‌, మహిపాల్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments