Thursday, April 30, 2026
HomeCRIMEగంజాయి మాఫియా దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కన్నుమూత..

గంజాయి మాఫియా దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కన్నుమూత..

గంజాయి మాఫియా అరాచకానికి ఒక నిప్పుకణిక బలయ్యింది. విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.

గత తొమ్మిది రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. జనవరి 23వ తేదీ సాయంత్రం నిజామాబాద్ పట్టణంలో గంజాయి మాఫియా శక్తులను అడ్డుకునే క్రమంలో సౌమ్యపై దుండగులు దాడికి తెగబడ్డారు.

ఈ దాడిలో ఆమె మూత్రపిండాలు , ప్లీహం, కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించగా, వైద్యులు శ్రమించినా ఫలితం లేకపోయింది.

శనివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సౌమ్య తండ్రి సాయిలు, తల్లి చంద్రకళ నిత్యావసర సరుకులు అమ్ముకుంటూ సామాన్య జీవితం గడుపుతున్నారు. తమ్ముడు శ్రవణ్ డిగ్రీ పూర్తి చేసి ఎస్సై పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.

కూతురు ఉన్నత స్థితికి చేరుతుందని ఆశించిన ఆ తల్లిదండ్రులకు ఈ వార్త తీరని శోకాన్ని మిగిల్చింది. సౌమ్య ప్రాణత్యాగం ఎక్సైజ్ శాఖ ప్రతిష్టను పెంచిందని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి కొనియాడారు.

మాదకద్రవ్యాల నిర్మూలనలో ఆమె చూపిన సాహసం మరువలేనిదని వారు పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి నిమ్స్ ఆసుపత్రికి చేరుకుని సౌమ్య భౌతికకాయానికి నివాళులర్పిస్తారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం, ఇతర ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ నుండి అడిషనల్ కమిషనర్ వరకు అందరూ ఉదయం నిమ్స్ ఆవరణలో యూనిఫాంతో హాజరై నివాళులర్పించాలని తెలంగాణ ఎక్సైజ్ అసోసియేషన్ JAC పిలుపునిచ్చింది.

అంత్యక్రియలు: ఆదివారం సాయంత్రం 3:00 గంటలకు నిజామాబాద్ జిల్లా, మోస్రా గ్రామంలోని ఆమె స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!