HomeCRIMEరూ.5.15 కోట్ల డ్రగ్‌ ఆస్తులపై పోలీసుల ఉక్కుపాదం ఆల్ప్రాజోలం అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. సతారా...

రూ.5.15 కోట్ల డ్రగ్‌ ఆస్తులపై పోలీసుల ఉక్కుపాదం ఆల్ప్రాజోలం అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. సతారా పారిశ్రామిక ప్రాంతంలో ఫ్యాక్టరీ సీజ్‌.. 30 కిలోల ఆల్ప్రాజోలం స్వాధీనం

ఆల్ప్రాజోలం అక్రమ తయారీ, రవాణా, విక్రయాల ద్వారా కూడబెట్టిన కోట్లాది రూపాయల ఆస్తులపై నిజామాబాద్‌ పోలీసులు ఉక్కుపాదం మోపారు. అంతర్రాష్ట్ర డ్రగ్‌ తయారీ, సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించిన పోలీసులు.. నిందితులు అక్రమంగా సంపాదించిన రూ.5.15 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను జప్తు చేశారు.

మరోవైపు డ్రగ్‌ నెట్‌వర్క్‌ వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు బోధన్‌ ఏసీపీ పి. శ్రీనివాస్‌ పర్యవేక్షణలో బోధన్‌ రూరల్‌ సీఐ డి. విజయ్‌బాబు ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

బోధన్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆల్ప్రాజోలం తయారీ, సరఫరాకు పాల్పడుతున్న ఐదుగురిని గతేడాది పోలీసులు అరెస్టు చేశారు. క్రైం నంబర్‌ 148/2025గా ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

వారి వద్ద నుంచి 2.5 కిలోల ఆల్ప్రాజోలం, రూ.25 లక్షల విలువైన మత్తుపదార్థం, స్కోడా కారు, ఎనిమిది సెల్‌ఫోన్లు, రూ.2.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.నిందితులను పోలీస్‌ కస్టడీలోకి తీసుకుని విచారించడంతో ఆల్ప్రాజోలం తయారీ, సరఫరా నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక సమాచారం లభించింది.

దీంతో సీఐ విజయ్‌బాబు ఆధ్వర్యంలో సుమారు 15 మంది పోలీసులతో ప్రత్యేక బృందం మహారాష్ట్రకు వెళ్లి వారం రోజుల పాటు దర్యాప్తు చేపట్టింది.సతారా పారిశ్రామిక ప్రాంతంలో ‘సూర్య ప్రభ ఫార్మా కెమ్‌’ పేరుతో ఎరువుల తయారీకి అనుమతులు పొంది, అక్రమంగా ఆల్ప్రాజోలం తయారు చేస్తున్న కేంద్రాన్ని గుర్తించారు.

అక్కడ సోదాలు నిర్వహించి సుమారు 30 కిలోల ఆల్ప్రాజోలం, రూ.12 లక్షల నగదు, ఫోర్డ్‌ కారు స్వాధీనం చేసుకుని అక్రమంగా నిర్వహిస్తున్న ఫ్యాక్టరీని సీజ్‌ చేశారు.డ్రగ్‌ వ్యాపారం ద్వారా సంపాదించిన సొమ్ముతో నిందితులు కూడబెట్టిన ఆస్తులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

మహారాష్ట్రలోని పూణే, సతారా, అహ్మద్‌నగర్‌ జిల్లాల్లోని సబ్‌ రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యాలయాలను సంప్రదించి నిందితులు, వారి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సేకరించారు.ఏ1 ఆమర్‌సింగ్‌, ఏ2 బసవరాజ్‌, ఏ5 లక్ష్మణ్‌గౌడ్‌తో పాటు వారి కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులను గుర్తించారు.

ప్రభుత్వ విలువల ప్రకారం వీటి విలువ రూ.5.15 కోట్లు కాగా.. బహిరంగ మార్కెట్‌లో మరింత ఎక్కువగా ఉంటుందని పోలీసులు తెలిపారు.ఎన్డీపిఎస్ చట్టంలోని 68ఎఫ్(2) ప్రకారం కాంపిటెంట్ అథారిటీ , బాంబే, కాంపిటెంట్ అథారిటీ, చెన్నై ద్వారా ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి.

అలాగే వారి నుంచి 9.06 ఎకరాల వ్యవసాయ భూమి,1,370 చదరపు గజాల ఖాళీ స్థలాలు, ఒక కెమికల్‌ ఫ్యాక్టరీ,నాలుగు కార్లు,రెండు ద్విచక్ర వాహనాలు,బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.27 లక్షలు ఆస్తులు జప్తు చేశారు.

నిందితుల అక్రమ ఆస్తులను గుర్తించి జప్తు చేయడానికి సుమారు ఏడాది పాటు దర్యాప్తు, న్యాయపరమైన ప్రక్రియ కొనసాగింది.దర్యాప్తులో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. కేసుతో సంబంధం ఉన్న సుమారు 20 మంది వ్యక్తుల మొబైల్‌ ఫోన్‌ సమాచారాన్ని విశ్లేషించి కీలక ఆధారాలను సేకరించారు.

తయారీ కేంద్రం గుర్తింపు నుంచి డ్రగ్‌ నెట్‌వర్క్‌ ఛేదన, అక్రమ ఆస్తుల గుర్తింపు, జప్తు వరకు సుమారు 15 మంది పోలీసు సిబ్బంది నిరంతరంగా పనిచేశారు. డ్రగ్స్‌ ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేయడం ద్వారా మాఫియాకు ఆర్థికంగా కూడా గట్టి దెబ్బ కొడతామని సీపీ సాయి చైతన్య తెలిపారు.

మాదకద్రవ్యాల తయారీ, కొనుగోలు, రవాణా, నిల్వ, పంపిణీ, విక్రయాలు, వినియోగంతో పాటు ఆర్థిక లావాదేవీలపై నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. అంతర్రాష్ట్ర పోలీసుల సమన్వయంతో దర్యాప్తును మరింత విస్తృతం చేస్తామని వెల్లడించారు. *యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సీపీ సాయి చైతన్య సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

డ్రగ్స్‌ అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.డ్రగ్‌ నెట్‌వర్క్‌ల నిర్మూలనకు ప్రజల సహకారం అత్యంత కీలకమని సీపీ పేర్కొన్నారు. కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన బోధన్‌ రూరల్‌ సీఐ డి. విజయ్‌బాబు, పోలీసు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments