పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే కీలక నగరమైన నిజామాబాద్‌లో ఇందిరమ్మ టవర్లను పైలట్ ప్రాజెక్టుగా నిర్మించేందుకు 15–20 రోజుల్లో చర్యలు ప్రారంభిస్తామని ప్రకటించారు.
శనివారం నిజామాబాద్ రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇళ్లు కేటాయించడంలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ అనే తేడా ఉండదని మంత్రి స్పష్టం చేశారు.
అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను త్వరలో మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
అవసరమైతే మూడో, నాలుగో విడతల్లోనూ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు.
‘దొర’కు పేదవాడి బాధ తెలియదు
గత పాలకులకు పేదవాడి కష్టం తెలియదని పొంగులేటి విమర్శించారు.
గత ప్రభుత్వం రూ.8.81 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిందని ఆరోపించారు. పేదవాడికి ఇల్లు కట్టిస్తే తనకేం వస్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే లంచాలు వస్తాయని ఆలోచించిన నాటి పాలకులు.. పేదవాడి సొంతింటి కలను మాత్రం పట్టించుకోలేదన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా పేదలకు ఇళ్ల నమూనాలు చూపిస్తూ, ఎన్నికల తర్వాత ఇస్తామని హామీలు ఇచ్చారని విమర్శించారు. పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 60–65 వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని, మరో 30 వేల ఇళ్లు మొండిగోడల దశలోనే వదిలేశారని తెలిపారు. ఏటా రెండు లక్షల ఇళ్ల చొప్పున నిర్మించి ఉంటే పదేళ్లలో 20 లక్షల ఇళ్లు పూర్తయ్యేవని, నేడు పేద కుటుంబాలకు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు.
గత ప్రభుత్వంలో పింక్ రంగు చొక్కాలు వేసుకున్న వారికే ఇళ్లు ఇచ్చారని ఆరోపించిన మంత్రి.. ఇప్పుడు అర్హత ఉన్న వ్యక్తి పింక్ చొక్కా వేసుకున్నా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పెద్ద మనసు తమ ప్రభుత్వానికి ఉందన్నారు.
అదే ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఏమిటో చూపిస్తోందని పేర్కొన్నారు. నిర్మాణదారులకు మార్కెట్ ధర కంటే తక్కువకు సిమెంట్ అందించేలా పరిశ్రమలతో ప్రభుత్వం చర్చించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రూ.330–360 వరకు ఉన్న సిమెంట్ బస్తాను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.230కే అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
గతంలో మొండిగోడల దశలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. నిజామాబాద్‌లో సుమారు 400 ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా డ్రా ద్వారా కేటాయించినట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తల ఒత్తిడికంటే పేదల ఆత్మగౌరవానికే ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలకు శంకుస్థాపన
జిల్లాలో శిథిలావస్థకు చేరిన తహసీల్దార్, ఆర్డీవో, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. సుమారు 13–14 కార్యాలయాలకు త్వరలో శంకుస్థాపన చేసి, ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడించారు.
పింఛన్లకు ఈ నెల 31 వరకు దరఖాస్తులు
వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. అర్హులైన వారు ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రైతుల భూసమస్యలపై ప్రత్యేక దృష్టి
నిజామాబాద్ జిల్లాలోని భూ సమస్యలపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని, రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని పొంగులేటి తెలిపారు.
వివాదాలు లేని విధంగా భూ హక్కు పత్రాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
పార్టీ కంటే పేదవాడే ముఖ్యం
కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఇళ్లు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ కోరిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో పింక్ చొక్కాలు వేసుకున్న కార్యకర్తలకు ఇళ్లు ఇచ్చారని, మన కార్యకర్తలకు కూడా ఏదో ఒక విధంగా చేయాలని మహేష్‌కుమార్‌గౌడ్ తనను కోరారని చెప్పారు.
అయితే స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాత్రం పార్టీ కంటే పేదవాడే ముఖ్యమని, పేదవాడి ఆత్మగౌరవంతో ఆటలాడకూడదని చెప్పారని వివరించారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నప్పటికీ, ఇళ్ల విషయంలో మాత్రం అర్హులైన పేదలకే పారదర్శకంగా కేటాయింపులు చేస్తామని స్పష్టం చేశారు.
దీనిని కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, హౌసింగ్ ఎమ్డీ గౌతమ్, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
