రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా ప్రదర్శన నిలిపివేయడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లోని వెంకటరమణ థియేటర్ వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సినిమా చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రేక్షకులు.. ప్రదర్శనను అకస్మాత్తుగా నిలిపివేయడంపై నిరసనకు దిగారు. గత రెండు రోజులుగా సినిమాకు భారీగా డిమాండ్ ఉండటంతో థియేటర్ వద్ద ప్రేక్షకుల రద్దీ పెరిగింది.
సొంత పనులను సైతం పక్కన పెట్టి సినిమా చూసేందుకు వచ్చినా టికెట్లు దొరకడం లేదని పలువురు వాపోయారు. నేడైనా సినిమా చూసే అవకాశం ఉంటుందని ఆశతో వచ్చిన వారికి ప్రదర్శన నిలిపివేశారన్న సమాచారం తీవ్ర నిరాశకు గురిచేసింది.దీంతో ప్రేక్షకులు థియేటర్ గేటు ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.
సినిమా ప్రదర్శనను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే నేలపై కూర్చునైనా, నిల్చునైనా సినిమా చూస్తామని.. రద్దీ ఎంత ఉన్నా భరిస్తామని స్పష్టం చేశారు. ప్రేక్షకుల ఆందోళనతో అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులు వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా ప్రదర్శన కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
