రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం రోడ్డుపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. ధాన్యాన్ని కల్లాలలో పోసి నెలలు గడుస్తున్నప్పటికిని కొనుగోలు చేయడంలో అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు.
కాలం గడిచిపోయిన మళ్లీ వర్షాకాలం సీజన్ ప్రారంభం కావస్తున్నా ఇప్పటివరకు వరి మొక్కజొన్న పంటలు ఇంకా కళ్ళల్లోనే ఉన్నాయని లారీలు సైతం రాక ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు అధికారులకు విన్నవించిన ప్రయోజనం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క వర్షాలు పడే ధాన్యం తడిసిపోతున్నప్పటికీ పట్టించుకునే నాధుడు లేక రాత్రనకా పగలనకా సెంటర్లలో పడికాపులు కాస్తున్నామని అన్నారు.
సుమారు రెండు గంటల పాటు జరిగిన ధర్నా రాస్తారోకోతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు రైతులకు సముదయించి త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.
అనంతరం వరి కొనుగోలు సెంటర్ వద్దకు వెళ్లి పరిస్థితులను వివరించారు. ఆరుగాలం పండించిన పంట సమయానికి పోక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వెంటనే ధాన్యం కొనుగోళ్లు జరిపేలా చర్యలు చేపట్టాలని రైతుల కోరారు.
