చిన్నారులే ఎక్కువడెంగీ, టైఫాయిడ్ కేసులతో కలవరంజిల్లాలో విష జ్వరాలు కుదిపేస్తున్నాయి. ముసురు వర్షాలతో వాతావారణంలో నెలకొన్న మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. పిల్లలు, పెద్దలు జ్వరాలతో వణికి పోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
వర్షాలు కురుస్తున్నాయన్న ఆనందం కంటే.. విషజ్వరాలు ఎక్కడ పట్టుకుంటాయోనన్న భయమే జిల్లావాసులను వెంటాడుతోంది.జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారు ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయడంతో డెంగీ, టైఫాయిడ్, మలేరియా, చికున్‌గున్యా, డయేరియా, వైరల్ జ్వరాలు అని నిర్ధారణ కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఖాళీ స్థలాలు, గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో దోమల ఉద్ధృతి పెరిగింది.
ఫలితంగా దోమకాటు, వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ జీజీహెచ్‌కు నిత్యం 2 వేలకు పైగా ఓపీ వస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇందులో జ్వర బాధితుల సంఖ్య గణనీయంగా ఉంటోంది. రోగుల తాకిడి పెరగడంతో జ్వర బాధితుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు జీజీహెచ్ ఇంచార్జీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు తెలిపారు.
జూన్‌లో డెంగీ–2, టైఫాయిడ్–100 కేసులు నమోదయ్యాయి. జులైలో డెంగీ–25, టైఫాయిడ్–175, చికెన్‌గున్యా–1 కేసు నమోదైంది. ఆగస్టు 6 వరకు డెంగీ–7, టైఫాయిడ్–18 కేసులు నమోదయ్యాయి అని అన్నారు.
జిల్లాలో దాదాపు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వద్ద జ్వర బాధితులతో రద్దీ పెరిగింది. ముఖ్యంగా చిన్నారులు అతిసారం, వాంతులు, జ్వరంతో ఆసుపత్రులకు వస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
*చిన్నారుల్లోనే అధికం..*
వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావం ముఖ్యంగా చిన్నారులపై ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి లక్షణాలతో పలువురు పిల్లలు ఆసుపత్రులకు వస్తున్నారు. ఒక్క వారంలోనే సుమారు 300 మంది చిన్నారులు విషజ్వరాలతో చికిత్స పొందినట్లు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు తెలిపారు.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నారుల్లో అతిసారం సాధారణంగా వైరస్ కారణంగా వస్తుంది. రెండేళ్లలోపు పిల్లల్లో రోటావైరస్ కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డిసెంట్రీలో రక్త విరేచనాలు ఉండవచ్చు.
సాధారణంగా ఈ వ్యాధి కొన్ని రోజుల్లో తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. పిల్లల్లో నిర్జలీకరణకు గురయ్యే ప్రమాదం ఉండటంతో జాగ్రత్త అవసరం. విరేచనాలు ఎక్కువగా ఉన్నా, వాంతులు ఆగకపోయినా, నీరసం, మూత్రం తగ్గడం వంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
*డెంగీ.. ప్లేట్‌లెట్లపై ప్రభావం*
ఏడిస్ దోమ కుట్టినప్పుడు డెంగీ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇన్ఫెక్షన్ ప్రభావంతో రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. అయితే జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్లేట్‌లెట్లు తగ్గుతాయని భావించాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.
డెంగీ నిర్ధారణకు వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి.డెంగీ లక్షణాలివే: ఆకస్మికంగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, అలసట, వికారం, వాంతులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరిలో స్వల్ప రక్తస్రావం కూడా ఉండొచ్చు.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.‘భయపడొద్దు.. జాగ్రత్తగా ఉండండి’
జీజీహెచ్ ఇంచార్జీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములువిషజ్వరాల విషయంలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని జీజీహెచ్ ఇంచార్జీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు తెలిపారు.. డెంగీ, టైఫాయిడ్ లక్షణాలతో వచ్చే వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.
రోగుల తాకిడి పెరగడంతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏ సమస్య తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.-డెంగీ అనుమానం ఉంటే వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలన్నారు.
