ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ వీధి చౌరస్తాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ‘ఆదిత్య చికెన్ సెంటర్’ షాపులో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీ హనుమాన్ వీధికి చెందిన కొండూరు రుక్మాబాయి (50) సదరు చికెన్ షాపులో పనిచేస్తోంది. ఆదివారం వ్యాపారం జోరుగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో రుక్మాబాయికి ఛాతి భాగంలో దాదాపు 60 శాతానికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కాపాడే ప్రయత్నంలో పక్కనే ఉన్న ఆమె కుమారుడు రాజేష్ చేతులకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన రుక్మాబాయి, రాజేష్‌లను 108 అంబులెన్స్ ద్వారా తక్షణమే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం రుక్మాబాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
