బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే కళాశాలలో ఆదివారం రాత్రి ఫుడ్ పాయిజన్ అయింది . సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగ కళాశాల యాజమాన్యం అప్రమత్తమైంది. వెంటనే విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.ఘటన విషయం తెలుసుకున్న అధికారులు సోమవారం ఉదయం ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
తాము తినే ఆహారంలో పదేపదే వాడిన నూనె లేదా నాణ్యతలేని నూనె ఉపయోగించడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండొచ్చని కొందరు విద్యార్థులు తమ అనుమానాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శివకుమార్‌పై సర్పంచ్ ధర్మతేజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదని, వారికి ప్రతిరోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వంటశాల నిర్వహణ, ఆహార నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని హెచ్చరించారు.కాగా, ఫుడ్ పాయిజన్‌కు గల ఖచ్చితమైన కారణం వైద్యుల నివేదిక లేదా అధికారుల విచారణ అనంతరం మాత్రమే నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
