Thursday, April 23, 2026
HomeCRIMEవిదేశీ ప్రయాణాలు.. విధులకు గైర్హాజరు!నియమ నిబంధనలు గాలికి వదిలేశారు..

విదేశీ ప్రయాణాలు.. విధులకు గైర్హాజరు!నియమ నిబంధనలు గాలికి వదిలేశారు..

ఉన్నతాధికారుల అండదండలతో ఆ ‘అవుట్ సోర్సింగ్’ ఉద్యోగి ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. డ్యూటీకి రాకపోయినా హాజరు పడుతోంది.. వేతనం అందుతోంది..

ఏకంగా వర్క్ వీసాపై విదేశాలకు వెళ్లొచ్చినా ప్రశ్నించే నాథుడే కరువయ్యారు. నిజామాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ జోన్-2 లో వెలుగుచూసిన ఈ ఉదంతం ఇప్పుడు కార్పొరేషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

నగర పాలక సంస్థ జోన్-2 లో అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి బరితెగింపుకు పరాకాష్టగా నిలుస్తున్నారు. సదరు వ్యక్తి 12-04-2024 తేదీన నిబంధనలకు విరుద్ధంగా, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వర్క్ వీసాపై దుబాయ్ వెళ్లారు. దాదాపు 4 నుండి 5 నెలల పాటు విదేశాల్లో ఉండి తిరిగి వచ్చి, ఏమీ తెలియనట్లుగా మళ్లీ విధుల్లో చేరడం గమనార్హం.

అసలు ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అనుమతి లేకుండా విదేశాలకు ఎలా వెళ్లారు? తిరిగి వచ్చిన తర్వాత అధికారులు అతన్ని విధుల్లోకి ఎలా తీసుకున్నారు? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.సదరు ఉద్యోగి ఆగడాలు అక్కడితో ఆగలేదు.

గత నెల 09-01-2025 నుండి 17-03-2025 వరకు మళ్లీ ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. ఒకవైపు తోటి ఉద్యోగులు పనిభారంతో సతమతమవుతుంటే, మరోవైపు ఇతను మాత్రం విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు.

ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మౌనం వహించడం వెనుక సదరు ఉద్యోగికి ఎవరో బలమైన ‘హస్తం’ తోడైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సదరు ఉద్యోగి పాస్‌పోర్టును తనిఖీ చేస్తే అతను ఏయే దేశాలకు వెళ్లారు, ఏ కాలంలో వెళ్లారు అనే నిజాలు బయటపడతాయి. తక్షణమే విజిలెన్స్ విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన ఉద్యోగితో పాటు, అతనికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తోటి ఉద్యోగులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పని దొరక్క నిరుద్యోగులు అలమటిస్తుంటే, ఇలాంటి అక్రమార్కులు విధులకు ఎగనామం పెట్టి జీతాలు పొందడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!