HomeTelanganaNizamabadఎన్‌ఎస్‌యూఐ నుంచి కార్పొరేషన్ వరకు..కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్‌గా మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్..

ఎన్‌ఎస్‌యూఐ నుంచి కార్పొరేషన్ వరకు..కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్‌గా మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్..

విద్యార్థి నాయకుడిగా రాజకీయ ఓనమాలు దిద్ది.. అంచెలంచెలుగా ఎదిగి నేడు రాష్ట్ర స్థాయి పదవిని అధిరోహించారు బాడ్సి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తగా కాంగ్రెస్ జెండా పట్టిన నాటి నుండి, నేడు తెలంగాణ రాష్ట్ర కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీకి ఆయన చేసిన సుదీర్ఘ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ కీలక బాధ్యతను అప్పగించింది. నియామక వార్త తెలియగానే కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు బాడ్సిలోని ఆయన నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు.

తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డిలకు చంద్రశేఖర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రశేఖర్ గౌడ్ ప్రస్థానం విద్యార్థి నాయకుడిగా ప్రారంభమై నేడు రాష్ట్ర స్థాయి పదవి వరకు కొనసాగింది. ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక మైలురాళ్లు ఇవే: ఉస్మానియా యూనివర్శిటీ నుంచి బీకామ్ పట్టా పొందారు.

1985లో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ఉపాధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2001లో తన సొంత గ్రామం బాడ్సి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

2006లో రెండోసారి విజయం సాధించి, ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడిగా, టీపీసీసీ డెలిగేట్‌గా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ పార్టీ ఇన్‌ఛార్జిగా క్రియాశీలకంగా వ్యవహరించారు.

రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యుడిగా, జిల్లా గౌడ సంఘం కోశాధికారిగా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు.గాంధీజీ, రాజీవ్ గాంధీల ఆశయాలతో ముందుకు సాగుతున్న చంద్రశేఖర్ గౌడ్‌కు ఈ పదవి దక్కడం పట్ల జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments