జిల్లావ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నా, ప్రభుత్వం ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంపై బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రైతులు పండించిన ధాన్యం రాశులుగా కల్లాల్లోనే పేరుకుపోతున్నాయని, అకాల వర్షాల భయంతో రైతులు రాత్రంతా జాగారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనత వల్లే కొనుగోలు ప్రక్రియలో జాప్యం జరుగుతోందని విమర్శించారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలను వెంటనే ప్రారంభించి, ధాన్యం సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కేంద్రాలు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారులు, దళారులు రైతులను నిలువునా దోచుకుంటున్నారని పటేల్ ఆరోపించారు.
మద్దతు ధర కంటే తక్కువ ధరకే ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి రైతులకు కల్పించవద్దని కోరారు. జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని ఆయన పలు డిమాండ్లను లేవనెత్తారు. జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామానికి అందుబాటులో ఉండేలా వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రతి కేంద్రంలో రైతులకు ఇబ్బంది కలగకుండా తగినన్ని గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు ముందే అందుబాటులో ఉంచాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం వర్షానికి తడవకముందే రైస్ మిల్లులకు తరలించడానికి సరిపడా రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా తేమ, తరుగు పేరుతో రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టకూడదని, మద్దతు ధరలో కోతలు విధించకూడదని స్పష్టం చేశారు. తక్షణమే స్పందించి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించకపోతే, రైతుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
