- జక్రాన్ పల్లి మండలం అర్గుల్ లో యువరైతుకు వడ్డీ వ్యాపారుల వేధింపులు
- వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కుంట రాజేష్
- ఆర్మూర్ డివిజన్ లో అడ్డగోలుగా వసూళ్లకు ఎగబడుతున్న వడ్డీ వ్యాపారులు
- నా భర్త చావుకు ఫైనాన్స్ వ్యాపారులే కారణమంటూ మృతుడి భార్య ఆరోపణ
జాన రమేష్ : ఇది సంగతి : ఆర్మూర్:
పేదల రక్తాన్ని తాగే జలగలు కాదు వాళ్ళు… వారి ప్రాణాలను హరించే యముళ్ళు. సామాన్య ప్రజల అవసరాన్ని వ్యాపారంగా చేసుకుంటూ అడ్డగోలుగా వసూళ్లకు ఎగబడుతున్న వడ్డి వ్యాపారులు వారి నడ్డి విరుస్తున్నారు. మూడు రూపాయల నుండి పది రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తూ కోట్లకు పడగెత్తుతున్నారు.
ఎలాంటి లెక్కలు, పత్రాలు లేకుండా అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లో రోజురోజుకు ఈ వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఎక్కువవుతున్నాయి.
నెల నెల వడ్డీలు చెల్లించని వారిపై కఠిన వైఖరి చూపిస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. తమ వద్ద అప్పు తీసుకున్న వారి నుండి విలువైన డాక్యుమెంట్లను తనఖా పెట్టుకుంటూ వడ్డీ కోసం చుక్కలు చూపిస్తున్నారు.
తాజాగా వడ్డీ వ్యాపారుల చేతిలో చితికి ఓ యువ రైతు తనువు చాలించిన ఘటన జక్రాన్ పల్లి మండలం అర్గుల్ లో చోటు చేసుకోవడం కలకలం రేపుతుంది.
అప్పు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక కుంట రాజేష్ అనే యువరైతు ఆత్మహత్యకు ఒడిగట్టాడు.ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులు తాళలేక , తీసుకున్న అప్పులు చెల్లిస్తామని చెప్పిన ,అప్పు తీర్చడానికి తన వద్ద ఉన్న భూమి అమ్మి అందరికీ అప్పు చెల్లిస్తానని చెప్పిన వినకుండా ఆయనను మానసికంగా హింసించినట్లు తెలుస్తోంది.
తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మాట్లాడిన ఆడియో గ్రామంలోని సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రస్తుతం వైరల్ గా మారింది. తనకు ప్రాణం కంటే పరువే మిన్న అని, కనీసం గడువు ఇవ్వకుండా అప్పు వడ్డీ కట్టమని తనను వేధించడం సరైనది కాదని, తన చావుతో భార్యాబిడ్డలు అనాధలుగా మారతారని, దయచేసి వారిని కనికరించాలని రాజేష్ ఏడుస్తూ చెప్పిన ఆడియో విన్నవారికి హృదయాలు ద్రవించక మానవు.
రాజేష్ అంత్యక్రియలో వడ్డీ వ్యాపారుల ఆగడాలను నిలిపివేయాలంటూ పలువురు ఫ్లకార్డులతో నిరసన తెలియజేశారు. మానవత్వానికి మచ్చ తెచ్చె ఈ ఘటనపై సామాన్యులు గుర్రుమంటున్నారు. వీరికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మాత్రం కనీస చర్యలు చేపట్టడం లేదు.
నా భర్త చావుకు ఫైనాన్స్ వ్యాపారులే కారణం
- మృతుడు రాజేష్ భార్య
గ్రామంలో గౌరవప్రదంగా బ్రతుకుతున్న తన కుటుంబాన్ని అనేక రకాలుగా హింసించి, మానసికంగా దెబ్బతీసి, మా ఆయనకు నిద్రలేని రాత్రులు గడిచేలా చేశారు.
చనిపోయేముందు గ్రామ వాట్సప్ గ్రూపులో తను వాయిస్ మెసేజ్ లు పెట్టాడని తెలియజేశారు.
చెప్పిన టైంలో డబ్బు కట్టకపోతే ఏదైనా చేస్తామని బెదిరించారని, మా ఆయనకు వారి నుండి ప్రాణభయం కూడా ఉందని కనికరం లేకుండా జాలి లేకుండా మా ఆయన్ని హింసించిన ఆ దుర్మార్గులకు తగిన శిక్ష వేయాలి. నా భర్త చావుకు ఫైనాన్స్ వ్యాపారులే కారణం.
మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి