ఆర్టీసీ సమ్మె రాష్ట్రంలో చిచ్చు రేపుతోంది. కార్మికుల బలిదానాలు జిల్లాను వణికిస్తున్నాయి. ఒకవైపు డ్రైవర్ల ఆత్మహత్యలు, మరోవైపు ప్రభుత్వ కఠిన వైఖరితో పరిస్థితులు నిప్పుకణికల్లా మారాయి.
గురువారం వరంగల్ జిల్లా నర్సంపేటలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించడంతో ఆర్టీసీ కార్మిక లోకం భగ్గుమంది. మరోవైపు భద్రాచలం డిపోకు చెందిన డ్రైవర్ డి. లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండటంతో కార్మికుల్లో ఆందోళన, ఆవేదన కట్టలు తెంచుకుంటున్నాయి.
ఈ వరుస ఘటనలతో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా యంత్రాంగాన్ని హై అలర్ట్ చేసింది. ఎక్కడ ఏ ఆత్మాహుతి దాడి జరుగుతుందో, ఎక్కడ కార్మికులు ఆవేశానికి లోనవుతారోనని పోలీస్ యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఈ మేరకు నగరంలోని డిపో-1, డిపో-2 ల వద్ద పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించారు. గత సంఘటనల దృష్ట్యా డిపోల వద్ద ముందస్తుగా ఫైర్ ఇంజన్లను, 108 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ప్రతి కదలికపై నిఘా ఉంచేందుకు నిఘా వర్గాలను అప్రమత్తం చేశారు.
స్తంభించిన రవాణా.. రాస్తారోకోలతో హోరెత్తిన శివాజీ చౌరస్తా…కార్మికుల మరణవార్తలతో ఆగ్రహించిన జేఏసీ నాయకులు శుక్రవారం నిరసనను ఉధృతం చేశారు. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌరస్తా వద్ద వందలాది మంది కార్మికులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మా ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదా?” అంటూ కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు.న్యాల్ కల్ డిపో-2 నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా కార్మికులు అన్ని మార్గాలను దిగ్బంధనం చేశారు.
పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, కార్మికులు వెనక్కి తగ్గకుండా నిరసనను కొనసాగించారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
