రంగనాత్ ను ఉన్నపలంగా హైడ్రా కమిషనర్‌గా తప్పించాలంటూ హైకోర్టు ధర్మాసనం సీఎస్ సంజయ్ జాజుకు ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో ఓ ఐజీ స్థాయి అధికారికి బాధ్యతలు కట్టబెట్టాలని సూచించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్ 1, 2లలో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించి కోర్టు ధిక్కరణ కేసుపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ బేషరతుగా క్షమాపణలు తెలియజేశారు. కోర్టులు, దేశ న్యాయ వ్యవస్థపై తమకు ఎంతో నమ్మకం, అత్యున్నత గౌరవం ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్ 1, 2లలో ఉన్న 40 ఎకరాల భూమిలోకి హైడ్రా సిబ్బంది ప్రవేశించలేదని, అక్కడ ఎలాంటి కూల్చివేతలు లేదా ఇతర చర్యలు చేపట్టలేదని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లుగా పేర్కొన్నారు.
ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లా..!
అయితే, విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం రంగనాథ్ వ్యవహార శైలిపై కఠినమైన వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఇప్పటి వరకు దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయని ధర్మాసనం గుర్తుచేసింది.
అదేవిధంగా లోతుకుంట భూమి విషయంలో సుప్రీంకోర్టు స్టేటస్ కో అమల్లోనే ఉందని, అండర్ టేకింగ్ తర్వాత కూడా మళ్లీ అదే స్థలంలోకి వెళ్లడం ఏంటని ప్రశ్నించింది.
‘ఒకే ఒక్క అధికారిపై, ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి? నిబంధనలను పాటించకుండా, కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కనబెట్టి వ్యవహరించడం వల్లే కదా ఇన్ని పిటిషన్లు దాఖలవుతున్నాయి?’ అని ధర్మాసనం ప్రశ్నించింది.
ఒక వేళ రంగనాథ్ ఇలానే కొనసాగితే.. రూల్ ఆఫ్ లాకు అర్థం ఉండదని, పూర్తిగా తప్పుదోవ పట్టే ప్రమాదం కూడా ఉందని వ్యాఖ్యనించింది .అందుకే ఉన్నపలంగా తొలగించి ఐజి స్థాయి అధికారి ని నియమించాలని పేర్కొంది
