- కాకతీయ లక్ష్మి సరస్వతి కాలువల ద్వారా అందనున్న సాగునీరు
- సుమారు 12 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు
ఆర్మూర్: గత కొన్ని సంవత్సరాలుగా ఖరీఫ్ , రబీ పంటలకు ఉత్తర తెలంగాణ వరప్రదాయని ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందుతుంది . ఈ వాన కాలంలో కూడా పెద్ద మొత్తం విస్తీర్ణంలో రైతులు వరి పంట వేసెందుకు సిద్ధమయ్యారు.
ఈ సీజన్ ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్న , రైతులు ఆశించిన వర్షాలు లేకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందారు. అయితే గత మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న ముసురు వరి పంట వేసే రైతులకు ఊరట కలిగించింది.
అంతేకాకుండా ప్రతి సంవత్సరం జూలై 1న ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లిగేట్లు ఎత్తివేయడంతో ఎగువ నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఇప్పటికే ప్రాజెక్టులోకి వరద నీరు చేరిన తర్వాత సాగునీరు లక్ష్మి, కాకతీయ, సరస్వతి కాలువల ద్వారా అధికారులు విడుదల చేస్తారని ఆశాభావంతో రైతులు వరి పంటకు సిద్ధమయ్యారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరుపొందిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మించి ఇప్పటికీ 43 సంవత్సరాలు అవుతుంది. ప్రాజెక్టు నిర్మించిన నాటినుండి ఇప్పటివరకు ఐదేళ్లు మినహా ప్రతి సంవత్సరం రెండు పంటలకు సాగునీరు అందింది.
గత సంవత్సరం కూడా యాసంగితోపాటు ఖరీఫ్ సాగు కోసం ఆయకట్టు రైతులకు నీరు అందింది. సుమారు 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు మూడు కాలువల ద్వారా సాగునీరు అందుతుంది.
నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి ,కరీంనగర్ , హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల వరకు రైతులకు సాగునీరు అందుతుంది. వర్షాకాలం మొదలు కావడంతో ఆయకట్టు పరిధిలోని రైతులు ఈసారి కూడా శ్రీరాంసాగర్ పైనే ఆశలు పెట్టుకున్నారు.
అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాలోని గుత్ప, అలీ సాగర్ చౌటుపల్లి హనుమంత రెడ్డి ప్రాజెక్టుల కింద వరి పంటలు వేసేందుకు రైతులు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రైతులు ప్రాజెక్టు ద్వారా తమ పంటపొలాలకు సాగునీరు అంది సమృద్ధి అయిన వరి పంటలు పండిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
