HomeCRIMEనగరంలో దర్జాగా అక్రమ నిర్మాణం! అనుమతి కాలం చెల్లినా.. యథేచ్ఛగా ‌ నిర్మాణం..ప్రభుత్వ ఆదాయానికి...

నగరంలో దర్జాగా అక్రమ నిర్మాణం! అనుమతి కాలం చెల్లినా.. యథేచ్ఛగా ‌ నిర్మాణం..ప్రభుత్వ ఆదాయానికి గండని కమిషనరే చెప్పినా పట్టించుకోని టౌన్ ప్లానింగ్..! కమిషనర్‌ నోటీసు.. కోర్టు ఆదేశాలూ కూడా ఉత్తవేనా ?

నగరంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ విభాగమే వాటికి అండగా నిలుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగర నడిబొడ్డున, నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే బస్టాండ్‌ ప్రాంతంలోనే నిబంధనలకు విరుద్ధంగా ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మాణం సాగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బస్టాండ్‌కు సమీపంలోనే మెడికల్‌ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి ఉండటంతో ఈ ప్రాంతంలో నిత్యం విపరీతమైన రద్దీ ఉంటుంది. అలాంటి చోట కనీస సెట్బ్యాక్‌ లేకుండా రహదారికి అంతరాయం కలిగించేలా నిర్మాణం జరుగుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత భవనానికి 2016లో సెల్లార్‌, స్టిల్ట్‌ ఫ్లోర్‌తో పాటు నాలుగు పై అంతస్తులకు అనుమతి పొందినట్లు సమాచారం. అయితే నిర్ణీత కాలంలో నిర్మాణం చేపట్టకపోవడంతో ఆ అనుమతి కాలం 2019 లో లాప్స్ అయ్యింది.అయినా 2024లో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమైనట్లు సమాచారం.

కాలం చెల్లిన అనుమతినే ఆధారంగా చేసుకుని నిర్మాణం కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్మాణంపై 2024లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అధికారులు పంచనామా నిర్వహించినట్లు సమాచారం.

అందులో భవన నిర్మాణానికి సంబంధించి అనుమతి కాలం చెల్లిపోయిందని, నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అవసరమైన సెట్బ్యాక్‌ పాటించలేదని పేర్కొన్నట్లు తెలిసింది. అనుమతి లేకుండానే నిర్మాణం కొనసాగుతోందన్న అంశాలూ అందులో నమోదు చేసినట్లు సమాచారం.

కమిషనర్‌ నోటీసులూ బేఖాతర్‌?

ఈ వ్యవహారంపై మున్సిపల్‌ కమిషనర్‌ 2026 ఫిబ్రవరిలో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాన్ని 15 రోజుల్లో కూల్చివేత చేయాలని అందులో ఆదేశించినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణంతో మున్సిపల్‌ ఆదాయానికి నష్టం వాటిల్లే అంశాన్ని కూడా నోటీసులో ప్రస్తావించినట్లు తెలిసింది.

అక్రమ నిర్మాణంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం వాటిల్లుతుందని షోకాజ్‌ నోటీసులో కమిషనర్‌ పేర్కొన్నట్లు సమాచారం. అయినా సంబంధిత టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కోర్టు ఆదేశాలున్నా.. కదలని అధికారులు

ఇదే అక్రమ నిర్మాణంపై కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సంబంధిత టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మాత్రం చర్యలకు ఉపక్రమించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వయంగా మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాలు, షోకాజ్‌ నోటీసులు ఉన్నా క్షేత్రస్థాయిలో నిర్మాణం విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఒకదానికి కొరడా.. మరోదానికి మౌనం?

గతంలో ఇదే వీక్లీ మార్కెట్‌ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతోందన్న కారణంతో ఓ అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సుమారు 42 దుకాణాలను అధికారులు కూల్చివేసినట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు. మరి ఇప్పుడు ఇదే ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నట్లు పంచనామాలో నమోదై, కమిషనర్‌ స్థాయిలో నోటీసులు జారీ అయినా చర్యలు ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

టౌన్‌ ప్లానింగ్‌ ‘చోద్యం’!

నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన విభాగమే మౌనం వహిస్తే అక్రమ నిర్మాణదారులకు అడ్డుకట్ట ఎలా పడుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు వెలుస్తున్నాయన్న ఆరోపణల మధ్య బస్టాండ్‌ నడిబొడ్డున సాగుతున్న ఈ నిర్మాణం వ్యవహారం టౌన్‌ ప్లానింగ్‌ పనితీరుపై మరోసారి అనుమానాలు రేకెత్తిస్తోంది. కమిషనర్‌ ఆదేశాలు, షోకాజ్‌ నోటీసులు, పంచనామా, న్యాయస్థాన ఆదేశాలు ఉన్నా నిర్మాణం విషయంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారన్నదానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments