నిజామాబాద్ నగరపాలక సంస్థ 8వ డివిజన్‌లో అక్రమ కట్టడాల దందా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి అక్రమార్కులు నిర్మిస్తున్న కట్టడాలతో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే, అటువైపు కన్నెత్తి చూడాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నగరంలోని జరుగుతున్న నిర్మాణాలే ఇందుకు నిదర్శనం. అక్రమార్కులు సెట్‌బ్యాక్ నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసి, కనీస అనుమతులు కూడా లేకుండా తమకు నచ్చినట్టు నిర్మాణాలు చేపడుతున్నారు.
కేవలం 20 అడుగుల రోడ్డు ఉన్న ఆ ప్రాంతంలో, రోడ్డును ఆక్రమిస్తూ ఏకంగా ర్యాంపులను నిర్మించడంతో వాహనదారులు, పాదచారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ వ్యవహారంపై బిజెపి ఫ్లోర్ సెక్రటరీ, స్థానిక కార్పొరేటర్ మఠం పవన్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“గతంలోనే ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం వెనుక ఆంతర్యమేంటి?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని, అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరి ఒత్తిడికి తలొగ్గుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజల ప్రాణాలతో, సౌకర్యాలతో చెలగాటమాడుతున్న అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేసి, వాటిని తొలగించాలని పవన్ కుమార్ మున్సిపల్ కమిషనర్‌ను డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా యంత్రాంగం నిద్రమత్తు వదిలి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
