బీజేపీ చేపట్టిన ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం లోనే నిజామాబాద్ 3.50 లక్షల సభ్యత్వంతో టాప్‌లో నిలిచిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.
మంగళవారం నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి హోటల్ లో బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు..
ఇందూరు జిల్లా బిజెపి కంచుకోటగా ఉండాలని తెలిపారు. దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉన్న బీజేపీ సభ్యత్వ నమోదును ఈసారి మరింత రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలందరూ పాల్గొని ప్రతి పోలింగ్ బూత్ నుండి కనీసం 200 మందిని సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు.
బిజెపి సభ్యత్వ నమోదు చేసుకుంటే ప్రతి పౌరునికి భరోసాగా సెక్యూరిటీగా బిజెపి నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే మొన్నటి వరకు జరిగిన బాంగ్లాదేశ్ అల్లర్లు మాదిరిగా భారతదేశంలో కూడా అల్లర్లు చేసే విధంగా కాంగ్రెస్ చేస్తుందని విమర్శించారు.
ప్రతి పోలింగ్ బూత్లో సభ్యత్వ నమోదు లక్ష్యాలు వివరించి, పార్టీ శ్రేణులు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మార్గనిర్దేశం చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సభ్యత్వ నమోదు ప్రక్రియ ఎంతో దోహదపడుతోందని అన్నారు.
ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లి అన్ని వర్గాల నుంచి సభ్యత్వాలు స్వీకరించాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ బూత్లో సభ్యత్వ నమోదు లక్ష్యాలను వివరించి, పార్టీ శ్రేణులు పెద్ద మొత్తంలో సభ్యత్వ నమోదు చేపట్టాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని మార్గనిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా బిజెపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
