నిజామాబాద్, ఇది సంగతి : కాంగ్రెస్ పార్టీ కోసం సుదీర్ఘకాలంగా విధేయతతో పనిచేస్తున్న నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నగర అధ్యక్షుడు సుభాష్ జాదవ్‌కు నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కుతుందా అనే చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్టీ రిజర్వేషన్ కావడంతో, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన సుభాష్ జాదవ్‌ను ఈ పదవికి ఎంపిక చేయాలని ఆయన సామాజికవర్గ నాయకులు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. గత 14 ఏళ్లుగా పార్టీకి అంకితభావంతో సేవలందిస్తున్న ఆయనకు నామినేటెడ్ పదవుల్లో భాగంగా అవకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు కూడా పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపునకు స్పందిస్తూ కార్యక్రమాల్లో పాల్గొని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన సుభాష్ జాదవ్‌కు తగిన గుర్తింపు ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
ఈ నేపథ్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తనకు దక్కుతుందనే ఆశాభావాన్ని సుభాష్ జాదవ్ వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులందరి ఆశీర్వాదం తనకు ఉంటుందని, అధిష్టానం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఎస్టీ రిజర్వేషన్ నేపథ్యంలో సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, స్థానిక నాయకత్వం నుంచి వస్తున్న మద్దతు వంటి అంశాల నేపథ్యంలో సుభాష్ జాదవ్ పేరు పరిశీలనలోకి వస్తుందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
