HomePOLITICAL NEWSTelanganaఎక్సైజ్ సూపరింటెండెంట్ బాధ్యత ముళ్లకిరీటమా. బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే సెలవుపై .. పోస్టు మార్చుకునే...

ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాధ్యత ముళ్లకిరీటమా. బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే సెలవుపై .. పోస్టు మార్చుకునే ప్రయత్నాలపై ప్రచారం..

వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆబ్కారి శాఖనిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో కీలక పోస్టులు ముళ్లకిరీటంగా మారాయి. వరుస వివాదాలు, ఏసీబీ దాడుల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇక్కడికి బదిలీ పై రావాలంటే ససేమిరా అంటున్నారు.ఇటీవల జరిగిన బదిలీల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే సెలవుపై వెళ్లిపోవడం శాఖలో కలకలం రేపుతోంది.

ఇంతవరకు ఆయన విధుల్లో చేరకపోవడంతో ఈ పోస్టులో కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదని, బదిలీ కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఎక్సైజ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ శాఖలో కీలక పోస్టులు అధికారులకు భారంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఎక్సైజ్ శాఖలో జరిగిన సాధారణ బదిలీల్లో జిల్లాకు ముగ్గురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఆ బదిలీ లో డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ ముగ్గురిని నియమించారు. ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ లు ఎట్టకేలకు బాధ్యతలు స్వీకరించారు.కానీ ఆ శాఖా లో కీలకమైన ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ నందగోపాల్ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే సెలవుపై వెళ్లిపోయారు.

అప్పటి నుంచి ఆయన విధులకు హాజరుకాకపోవడం శాఖలో అనేక అనుమానాలకు తావిస్తోంది. నిజామాబాద్‌లో కొనసాగకుండా మరో జిల్లాకు బదిలీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ఆయన గైర్హాజరు ఎక్సైజ్ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది.

నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో కీలక పోస్టులు గత కొంతకాలంగా వివాదాల చుట్టూనే తిరుగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన డిప్యూటీ కమిషనర్, ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక రాజీనామాకు సిద్ధమయ్యారనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి.

ఆ ఘటన మరవకముందే ఇటీవల ఈఎస్ పనిచేసిన మల్లారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు నిర్వహించి అరెస్టు చేయడం శాఖ ప్రతిష్ఠను దెబ్బతీసింది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో కీలక పోస్టుల్లో పనిచేయడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారనే చర్చ సాగుతోంది.

అదే బదిలీల్లో జిల్లాకు కేటాయించిన డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లు ఎలాంటి జాప్యం లేకుండా విధుల్లో చేరి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఈఎస్‌గా నియమితులైన నందగోపాల్ మాత్రం బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే సెలవుపై వెళ్లిపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.

ఆయన తిరిగి విధుల్లో చేరుతారా..? లేక బదిలీ సాధించుకుని వెళ్లిపోతారా..? అన్నది తేలాల్సి ఉంది. అప్పటివరకు అసిస్టెంట్ కమిషనర్ అరుణ్‌కుమార్ ఇన్‌చార్జ్ ఈఎస్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

వరుస వివాదాలు, ఏసీబీ కేసులు, తాజా పరిణామాల నేపథ్యంలో నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ఈఎస్ పోస్టు మరోసారి చర్చనీయాంశంగా మారింది. శాఖలో నెలకొన్న ఈ అనిశ్చితికి ఎప్పుడు తెరపడుతుందో చూడాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments