అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. ఆర్మూర్ లో చేపట్టిన జనహిత పాదయాత్ర జనసంద్ర పాదయాత్రగా మారింది. అడుగడుగునా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
కాంగ్రెస్ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేందుకు చేపట్టిన జనహిత పాదయాత్రను ఏఐసిసి ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ జెండా ఎగరవేసి ప్రారంభించారు.
ఆలూరు రోడ్ లోని బైపాస్ వద్ద కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు వచ్చిన వారికి.. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డి, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ కింది బజార్ నుండి గోల్ బంగ్లా మీదుగా పాత బస్టాండ్ వరకు పాదయాత్రలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెర్కిట్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఎఐసిసి కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ…
కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, నమ్మకం అని అన్నారు. దిశవ్యాప్తంగా రాహుల్ తన పర్యటనలో తెలంగాణ మోడల్ ను ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని అన్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ…
మాట ఇచ్చి మడమతిప్పని ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాలు చేపడుతుందని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన అవినీతిమయమని విమర్శించారు. అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమని అన్నారు . జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ…
పేదవారి కడుపును నింపేది, నిరుపేదలకు గూడును నిర్మించేది, అన్ని వర్గాలను ఆదుకునేది కేవలం కాంగ్రెస్ ద్వారా సాధ్యమని అన్నారు. నిజామాబాద్ అభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇంకా వీరితోపాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి లు మాట్లాడారు.
పాదయాత్రలో దొంగల చేతివాటం సందట్లో సడిమియా అన్నట్టు జనహిత పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో ఆర్మూర్ పట్టణంలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల జేబులను గుల్ల చేశారు.
బయటకు చెప్పలేక… మనసులో మదన పడలేక పలువురు బాధపడుతూ కనిపించారు.. అంబేద్కర్ కు నివాళులు అర్పించిన నటరాజన్ ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మీనాక్షి నటరాజన్ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అడుగడుగునా ఆమెకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, షబ్బీర్ అలీ, వెంకట్, జిల్లా పార్టీ అధ్యక్షుడు మండల మోహన్ రెడ్డి.
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి నాయక్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు , ఆకుల లలిత, డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
