నగరంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని సీసీఎస్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆదేశాల మేరకు సీసీఎస్ బృందం ఈ మెరుపు దాడి నిర్వహించింది.
నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మిర్చి కాంపౌండ్, కెనాల్ కట్ట, ఎరుకలవాడ ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో సీసీఎస్ ఏసీపీ (ఇంచార్జ్) మస్తాన్ అలీ సూచనల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్‌స్పెక్టర్ డి.సాయినాథ్, ఎస్.ఐ గోవింద్ సిబ్బంది కలిసి షేక్ సాహెబ్ హుస్సేన్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో సుమారు 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యమయ్యాయి. వీటితో పాటు బియ్యం తరలింపునకు సిద్ధంగా ఉంచిన మహేంద్రా బొలెరో (TS16UC0862) వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు.
బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
