కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇప్పిస్తానని నమ్మబలికి, ఓ నాయకుడు తన వద్ద నుంచి లక్ష రూపాయలు వసూలు చేసి మోసం చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారికి ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
నగరంలోని 49వ డివిజన్‌కు చెందిన మిర్యాల్కర్ గీత అనే మహిళ, గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ డివిజన్ మహిళలకు రిజర్వ్ కావడంతో పోటీ చేయాలని భావించారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు బుస్సాపూర్ శంకర్ ఆమెకు పరిచయమై, పార్టీ నుంచి టికెట్ ఇప్పిస్తానని నమ్మబలికారు.
ఇందుకు లక్ష రూపాయలు ఖర్చవుతుందని చెప్పడంతో, ఆమె అతని మాటలు నమ్మి ఫోన్ పే ద్వారా నగదు చెల్లించారు. కేవలం టికెట్ పేరుతోనే కాకుండా, ప్రచారానికి వినియోగించే కారు, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, నమూనా బ్యాలెట్ల పేరుతో అదనంగా మరికొంత నగదును కూడా వసూలు చేసినట్లు బాధితురాలు పేర్కొన్నారు.
నామినేషన్ల గడువు ముగిసే వరకు ఏదో ఒక సాకు చెబుతూ కాలయాపన చేసి, చివరి నిమిషంలో మరొకరికి టికెట్ ఖరారు చేయించారని ఆమె వాపోయారు. దీనివల్ల తాను పార్టీ తరపున గానీ, స్వతంత్ర అభ్యర్థిగా గానీ పోటీ చేసే అవకాశం కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ ప్రక్రియలో తన అసలు పదవ తరగతి ధ్రువీకరణ పత్రం కూడా పోగొట్టుకున్నానని గీత ఫిర్యాదులో వివరించారు. తీసుకున్న నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయగా, శంకర్ మరియు అతని తమ్ముడు కలిసి తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ, చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు.
తనకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా అధ్యక్షుడిని వేడుకున్నారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ నిమిత్తం ఫిర్యాదు కాపీని రాష్ట్ర కమిటీకి పంపిస్తామని, పార్టీ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
