HomeLaw and Orderప్రతి స్టాక్ పాయింట్ లో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ...రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా బుకింగ్...

ప్రతి స్టాక్ పాయింట్ లో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ…రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా బుకింగ్ యాప్ ద్వారా ప్రణాళికాబద్దంగా పంపిణీ… కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి.. ఎరువుల గోడౌన్లు, విక్రయ కేంద్రాలు తనిఖీ.. నానో యూరియా వినియోగాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించండి… రైతులకు అవగాహన కల్పించిన జిల్లా పాలనాధికారి..

జిల్లాలోని అన్ని సహకార సంఘాల గోడౌన్లలో, సేల్ పాయింట్లలో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా పర్యవేక్షణ చేస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. వానాకాలం సీజన్ పంటల సాగుకు అవసరమైన మేరకు పూర్తి స్థాయిలో ఎరువుల నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళనకు గురి కావద్దని సూచించారు.

ఎడపల్లి మండలంలోని జానకంపేట్, ఎడపల్లి లో గల ఎరువుల గిడ్డంగులు, విక్రయ కేంద్రాలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్లలో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను పరిశీలించి, స్టాక్ వివరాల రిజిస్టర్ లో పొందుపరచిన వాటికి అనుగుణంగా నిల్వలు అందుబాటులో ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు.

ఇప్పటివరకు ఎన్ని ఎరువుల బస్తాలు వచ్చాయి, ఎన్ని పంపిణీ చేశారు, ఇంకనూ ఎంత పరిమాణంలో నిల్వలు రావాల్సి ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా బుకింగ్ యాప్ పనితీరును కలెక్టర్ స్వయంగా పరిశీలన జరిపి, యాప్ వల్ల సమకూరే ప్రయోజనాల గురించి రైతులకు వివరించారు.

మన రాష్ట్రంలో అమలు అవుతున్న బుకింగ్ యాప్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఎరువుల పంపిణీ కోసం అమలు చేస్తున్నాయని అన్నారు. ఈ యాప్ వల్ల ఎలాంటి నష్టం లేదని, గత రబీ సీజన్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు.

ఎరువులు పక్కదారి పట్టకుండా, పారదర్శకంగా, ప్రణాళికాబద్దంగా యూరియా పంపిణీకి బుకింగ్ యాప్ దోహదపడుతుందని, దీని విషయంలో రైతులు అపోహలకు గురి కావద్దని సూచించారు. నానో యూరియా వాడకం వల్ల కలిగే లాభాలపై రైతులకు అవగాహన కల్పించారు.

ప్రయోగాత్మకంగా కొంత పరిమాణంలో నానో యూరియాను వినియోగించి ఫలితాలను స్వయంగా పరిశీలించాలని రైతులకు హితవు పలికారు. అయితే రైతులను నానో యూరియా కొనాలని బలవంతం చేయవద్దని, వారు కోరిన ఎరువులు మాత్రమే అందించాలని, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, డీలర్ల లైసెన్సులు రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

జిల్లా రైతుల అవసరాలకు సరిపడా ప్రస్తుతం 27 వేల మెట్రిక్ టన్నుల పైచిలుకు యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడ కూడా కొరత ఏర్పడకుండా రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు నిల్వలను చేరవేస్తున్నామని తెలిపారు.

పలు సొసైటీలు డిఫాల్ట్ లో ఉండగా, వాటి పరిధిలోని రైతులకు సైతం ఇబ్బందులు తలెత్తకూడదని, స్థానికంగానే వారికి ఎరువులు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో డీ.సీ.ఎం.ఎస్ ద్వారా ఎరువుల పంపిణీ జరిపిస్తున్నామని అన్నారు.

ఒకింత ముందుగానే పంటలు విత్తుకునే బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని, తదుపరి నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలలో కూడా పక్కాగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నామని, స్టాక్ పాయింట్లకు ఎరువుల నిల్వలు చేరవేశామని కలెక్టర్ వివరించారు.

మోతాదుకు మించి ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించకుండా, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ దత్తాద్రి, జానకంపేట్ సర్పంచ్ అనురాధ, సొసైటీ చైర్మన్ నరేందర్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments