ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడటమే కాకుండా, స్వతంత్ర భారత అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ, 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ, అప్పటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి జాతీయ పార్టీ అని కొనియాడారు.
1920 నుంచి మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసా మార్గంలో సాగిన పోరాటంలో కాంగ్రెస్ అగ్రభాగాన నిలిచిందని గుర్తు చేశారు. గాంధీజీ, అంబేడ్కర్ వంటి మహనీయులు ఈ పార్టీ వేదికగానే దేశ భవిష్యత్తుకు బాటలు వేశారని తెలిపారు.
దేశం కనీసం గుండు పిన్ను కూడా తయారు చేయలేని స్థితి నుంచి నేడు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ రాకెట్లు తయారు చేసే స్థాయికి చేరిందంటే అది కాంగ్రెస్ ప్రధానుల దీర్ఘకాలిక ప్రణాళికల ఫలితమేనని ఆయన స్పష్టం చేశారు.
“గడిచిన 17 లోక్సభ ఎన్నికల్లో 10 సార్లు విజయం సాధించి, సుమారు 49 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన ఘనత మన పార్టీది” అని గర్వంగా ప్రకటించారు.బీజేపీ తీరుపై విమర్శలుస్వాతంత్ర్య పోరాటంలో ఎక్కడా కనిపించని బీజేపీ, నేడు దేశ అభివృద్ధి అంతా తమ వల్లే జరిగిందని చెప్పుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత,యూత్ కాంగ్రెస్ నేతలు విపుల్ గౌడ్, వేణు రాజ్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
