గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టామన్నారు. మొదటి విడతలో 11 మండలాల్లోని 184 గ్రామపంచాయతీలు, 1642 వార్డులకుగాను 1653 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అలాగే క్లస్టర్లలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాలను నియమించి గురువారం ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగిందని తెలిపారు.
రిజర్వేషన్ల వివరాలు ఇప్పటికే టీ-పోల్లో నమోదు చేసినట్లు తెలిపారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేశామని.. ఎఫ్ఎస్ఈ, సర్వైలియన్ స్టాటిస్టిక్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అంతేగాకుండా సర్వైలియన్ స్టాటిస్టిక్ బృందాల ద్వారానే 6 చెకోపోస్టులు నిర్వహిస్తారని తెలిపారు.
అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహణకు తగిన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.అలాగే 309 మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల సిబ్బందికి ఒకమారు శిక్షణ ఇచ్చామని..
మరోమారు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.మొదటి విడత ఎన్నికలకు సంబంధించి గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయిందన్నారు. అందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం సర్వం సన్నద్ధంగా ఉందన్నారు.
డిసెంబరు 11, 14, 17 తేదీల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. అనంతర వెంటనే ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడించనున్నట్లు చెప్పారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని కోరారు.
