నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలను కేంద్ర ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురిచేస్తోందంటూ కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన ‘బీజేపీ కార్యాలయ ముట్టడి’ ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ నేతృత్వంలో కార్యకర్తలు భారీ ప్రదర్శనగా బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.
అయితే, అప్రమత్తమైన పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకుని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా పోలీసుల నిర్బంధంలో ఉన్న నేతలు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణలు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. “గత పదేళ్లుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో ఈడీ ద్వారా వేధిస్తున్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలను అస్త్రాలుగా వాడుకుంటున్నారు” అని ధ్వజమెత్తారు. ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. గాంధీ కుటుంబంపై మోపిన అభియోగాలు నిలకడలేనివని తేలిపోయిందని, బీజేపీ అరాచకాలను ఎండగట్టేందుకే తాము ఈ ఆందోళన చేపట్టామని స్పష్టం చేశారు.
రంగంలోకి ప్రత్యేక దళాలు..
భారీగా అరెస్టులు
ముట్టడి పిలుపు నేపథ్యంలో బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ కేటాయింపులు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయం వైపు వెళ్లకుండా రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు వాటిని తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో కాసేపు తోపులాట చోటుచేసుకుంది. ప్రత్యేక పోలీసు దళాలు రంగంలోకి దిగి నాయకులను చెదరగొట్టాయి. నగేష్ రెడ్డి, రామకృష్ణ సహా పలువురు సీనియర్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో గందరగోళం నెలకొంది. ఈ నిరసనలో నగర, జిల్లా స్థాయి కాంగ్రెస్ ముఖ్య నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
