జిల్లా కేంద్రంలో భారీ సైబర్ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. నకిలీ ధ్రువపత్రాలతో బ్యాంక్ ఖాతాలు సృష్టించి, వాటి ద్వారా కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించి బుధవారం తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ (సీపీ) పి. సాయి చైతన్య వెల్లడించారు.నిందితులు కర్ణాటక బ్యాంక్‌లో ఫోర్జరీ పత్రాలను సమర్పించి కరెంట్ అకౌంట్లు (వ్యాపార ఖాతాలు) తెరిచారు.
ఈ ఖాతాలను మధ్యవర్తుల ద్వారా సైబర్ నేరగాళ్లకు విక్రయించారు. కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే ఈ అకౌంట్ల ద్వారా సుమారు ₹152 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్మును దారి మళ్లించేందుకు ఈ ఖాతాలను వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాదారుల వివరాలను క్షేత్రస్థాయిలో సరిగ్గా ధ్రువీకరించకుండానే అకౌంట్లు ఓపెన్ చేసిన బ్యాంకు అధికారుల తీరుపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కేసులో ఇప్పటికే 7 మందిని అరెస్ట్ చేయగా, తాజా ఆపరేషన్‌లో మరో 9 మంది పట్టుబడ్డారు. ఇంకా మరికొంత మంది ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నామని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
ఈ కేసులో మహమ్మద్ జామెల్ అహ్మద్ (అర్సపల్లి), షేక్ షోయబ్ (యడపల్లి), మహమ్మద్ సమీర్, రహీమ్ అలీ, షేక్ అహ్మద్, షేక్ రహీం (నిజామాబాద్), భాను ప్రసాద్, మహమ్మద్ అర్బాజ్, బొగుడమీది వీరేశం, అబ్దుల్ వాసిమ్, షేక్ సమీర్ (బోధన్), షేక్ ఇఫ్తెఖార్, సబావత్ అశోక్ (రెంజల్)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో చాకచక్యంగా వ్యవహరించిన ఫోర్త్ టౌన్ ఇన్స్‌పెక్టర్ సతీష్‌తో పాటు సైబర్ క్రైమ్ విభాగాన్ని సీపీ ప్రత్యేకంగా అభినందించారు
