నగరంలో సరదాగా గడుపుదామని ఎగ్జిబిషన్‌కు వచ్చిన సందర్శకులకు ఘోర ప్రమాదం ఎదురైంది. కంటేశ్వర్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా కలకలం రేగింది.
రన్నింగ్‌లో ఉన్న ‘క్రేజీ వీల్’ రైడ్‌కు సంబంధించిన ఒక ట్రాలీ ప్రమాదవశాత్తు విరిగిపడటంతో ఇద్దరు యువకులు దాదాపు ఇరవై అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయారు.ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
కాగా, ఒక యువకుడు విరిగిపడిన ట్రాలీ ఇనుప ఊచల మధ్య ఇరుక్కుపోయి, బయటకు రాలేక తీవ్ర రక్తస్రావంతో నరకయాతన అనుభవించాడు. క్షతగాత్రులను గమనించిన తోటి సందర్శకులు, నిర్వాహకులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
గత వారమే దొంకేశ్వర్ మండలం నూత్‌పల్లికి చెందిన ఒక మహిళ ఇక్కడి జెయింట్ వీల్ ఎక్కి, భయంతో గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన మరవకముందే.. తాజాగా మరో ఘోర ప్రమాదం జరగడం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
వరుస సంఘటనలు జరుగుతున్నా ఎగ్జిబిషన్ నిర్వహణలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నుమాయిష్ పేరిట ఏటా ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తూ టికెట్లు, స్టాళ్ల రూపంలో నిర్వాహకులు లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నారు.
అయితే, అందుకు తగ్గట్టుగా సందర్శకులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఏర్పాటు చేయకపోవడం తో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా ఎగ్జిబిషన్ వద్ద ఒక అంబులెన్స్‌ను కానీ, డాక్టర్‌ను కానీ అందుబాటులో ఉంచకపోవడం నిర్వాహకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. కేవలం డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు” అని సందర్శకులు మండిపడుతున్నారు.
ఇలాంటి ప్రమాదకరమైన రైడ్ల ఫిట్‌నెస్‌ను అధికారులు సరిగా పరిశీలించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ అధికారులు స్పందించి ఎగ్జిబిషన్‌లో భద్రతా వసతులపై కఠిన నిబంధనలు అమలు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
