ఇందూర్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలకు నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్‌కు వెళ్లిన రైతులు, బిజెపి నాయకులను పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ కులచారి తీవ్రంగా మండిపడ్డారు.
నష్టపరిహారం కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకు రైతులతో కలిసి వెళితే.. కలెక్టరేట్ గేట్లు మూసివేసి, లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. జాయింట్ కలెక్టర్ వచ్చి తమను లోపలికి తీసుకువెళ్లినప్పటికీ, జిల్లా కలెక్టర్ కనీసం బయటకు వచ్చి అన్నదాతల గోడు వినకపోవడం అత్యంత శోచనీయం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో రైతులు అల్లాడుతుంటే వారి పట్ల అధికార యంత్రాంగం ఇంత అమానవీయంగా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి నేలపాలు కావడంతో రైతన్నలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని దినేష్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల ధాటికి జిల్లా వ్యాప్తంగా సుమారు 6000 ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించిందన్నారు. ప్రధానంగా జక్రాన్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, డిచ్‌పల్లి మండలాల్లో సుమారు 3,300 ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని, సాలూర మండలంలోని హున్స, కాజపూర్, మందార్ణ గ్రామాల్లో సుమారు 2000 ఎకరాలకు పైగా అరటి, మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా పాడయ్యాయని ఆయన వివరించారు
ప్రకృతి కన్నెర్రజేసి రైతులు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో విలవిలలాడుతుంటే, అధికార యంత్రాంగం నుండి కనీస స్పందన కరువవ్వడం తీవ్ర విచారకరమని ఆయన మండిపడ్డారు.
తక్షణమే రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పంట నష్టంపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించాలి.
నష్టపోయిన ప్రతి ఎకరాకు కనీసం రూ.50,000 చొప్పున వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
నష్టపోయిన రైతులకు తదుపరి సాగు కోసం ప్రభుత్వం తరపున ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలి.
రైతుల బ్యాంకు రుణాల వసూళ్లపై తక్షణమే వాయిదా (మొరటోరియం) ప్రకటించాలి.
వ్యవసాయ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌ను త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి.
రైతుల కష్టాన్ని, ఆవేదనను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి, పై డిమాండ్లను వెంటనే నెరవేర్చి వారికి న్యాయం చేయాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని దినేష్ పటేల్ కులచారి ప్రభుత్వాన్ని హెచ్చరించారు
