నగరంలోని పూసలగల్లీలో ఇటీవల జరిగిన భారీ ఇంటి దొంగతనం కేసును ఒకటవ టౌన్ పోలీసులు ఛేదించారు.ఏమేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి భారీగా బంగారు, వెండి ఆభరణాలతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని పూసలగల్లీలోని ఒక ఇంట్లో కొద్దిరోజుల క్రితం దొంగతనం జరిగింది.
దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించడంతో పాటు, పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానం, ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా సతీష్ నగర్‌కు చెందిన షేక్ సాదిక్ @ సదాక్ (32), గాజులపేటకు చెందిన మరాటి మాధవ్ (22), వెెంకల్ రావు కాలనీకి చెందిన షేక్ ఇస్మాయిల్ (30) గుర్తించి పట్టుకున్నట్లు విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి సుమారు 438 గ్రాముల వెండి వస్తువులు (పెద్ద ప్లేట్, రెండు చిన్న ప్లేట్లు), సుమారు 15 గ్రాముల బంగారు ఆభరణాలు (బుట్ట కమ్మలు, మాటిలు, ఉంగరం) స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నేరాలకు ఉపయోగించిన రెండు బైక్‌లు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు.
బుధవారం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ కు తరలించినట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. ఈ కేసును త్వరగా ఛేదించిన పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.
